Komatireddy Rajagopal Reddy
జూబ్లీహిల్స్ ఎన్నికల ముగియడంతో…సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లను భర్తీ చేయాలని కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు పేర్లను కూడా హైకమాండ్ ప్రతిపాదించినట్లు హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో చేరిక సందర్బంగా రాజగోపాల్‌రెడ్డి( Komatireddy Rajagopal Reddy)కి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇస్తే ఎలా అన్న చర్చ కాంగ్రెస్‌లో దుమారం రేపింది కూడా.
పార్టీలోకి చేర్చుకున్నపుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని రాజగోపాల్‌రెడ్డి( Komatireddy Rajagopal Reddy) ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన నల్గొండ జిల్లాకు…మూడు మంత్రి పదవులు ఉండకూడదా అంటూ పార్టీని ప్రశ్నించారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే…విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వెంకట్‌రెడ్డిని తప్పించి…రాజగోపాల్‌రెడ్డి( Komatireddy Rajagopal Reddy)ని కేబినెట్‌లోకి తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయి. వెంకట్‌రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ స్థాయిని కట్టబెట్టేందుకు కసరత్తు జరుగుతోంది.
ఇక విజయశాంతికి హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్ట్రాటజీలో భాగంగానే విజయశాంతికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకొని.. మహిళా ప్రాధాన్యం ఉన్న శాఖ ఇస్తారని టాక్. విజయశాంతిని రంగారెడ్డి జిల్లా కింద తీసుకుంటారనే చర్చ సాగుతోంది.
ఈ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేదు. అయితే సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి…కేబినెట్ ర్యాంక్‌తో కూడిన పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ ఐ కమాండ్. పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్‌ను…కేబినెట్‌లోకి తీసుకుంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీసీ సామాజికవర్గంతో పాటు నిజామాబాద్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. అందులో భాగంగానే కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది.
మహేశ్‌కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే…అదే సామాజికవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ను…తప్పించే అవకాశం ఉంది. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. అయితే పొన్నం ప్రభాకర్…పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు మొగ్గుచూపుతారా అన్నది ప్రశ్నార్థంగా మారింది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే భాగంగానే మహేశ్‌కు… మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనరలో హస్తం పార్టీ ఉంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
