KTR and Kavitha :తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి (BRS), గడచిన రెండేళ్లుగా ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. పదేళ్లపాటు అధికారంలో ఉండి, హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ, అనూహ్యంగా ఓటమి పాలైంది. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలపై పోరాడటం, ఉద్యమాలను నిర్మించడం వంటివి చేస్తుంది. BRS కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పార్టీలో కీలక శక్తులుగా ఉన్న కల్వకుంట్ల తారకరామారావు (KTR), కల్వకుంట్ల కవిత(KTR and Kavitha)ల మధ్య ఐకమత్యం కొరవడిందని, వారు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేటీఆర్–కవిత: ఎడముఖం పెడముఖంగా ఎందుకు?
KTR and Kavitha :సాధారణంగా, ఒక పార్టీలోని కీలక నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత సమన్వయంతో, ఒకే లక్ష్యంతో పనిచేయాలి. కానీ బీఆర్ఎస్(BRS)లో అన్నాచెల్లెళ్లు అయిన కేటీఆర్(KTR) , కవిత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తించడం పార్టీ వర్గాలకు సైతం మింగుడుపడటం లేదు. వారిద్దరూ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, ఒకరి కార్యక్రమాలకు మరొకరు మద్దతు ఇవ్వకపోవడం వంటివి పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి.
వేర్వేరు కార్యక్రమాలు:
ఇటీవల, కవిత తన తండ్రిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో, KTR సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన సమయంలో KTR ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ రెండు కార్యక్రమాలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి.
BC రిజర్వేషన్ల అంశం:
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత ఇటీవల రైల్ రోకో (Rail Roko) ఉద్యమానికి పిలుపునిచ్చారు. అయితే, ఈ ఉద్యమానికి కేటీఆర్ వర్గం దూరంగా ఉన్నట్లు, అలాగే కేసీఆర్ పక్షాన ఉన్న నాయకులు కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా కవితనే ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సి వచ్చింది. ఇది పార్టీలో వర్గపోరుకు బలమైన సంకేతంగా పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడ్డాయి.
బల నిరూపణ ప్రయత్నాలు:
కేటీఆర్( KTR )వైపు హరీష్ రావు (Harish Rao)ఇతర మాజీ మంత్రులు నిలిచారు. కీలక నాయకుల మద్దతు లేకపోయినప్పటికీ కవిత తన సొంత ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. ఇది ఇద్దరు నాయకులు తమ తమ బలాన్ని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విధంగా ఎవరికి వారు బల నిరూపణకు దిగడం పార్టీలో ఉన్న అంతర్గత లుకలుకలను బయటపెడుతుందని, ఎన్నికల సమయం నాటికి ఇవి మరింత పెద్ద అగాధంగా మారతాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది?
బీఆర్ఎస్(BRS )ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, పార్టీ నాయకత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం కొరవడినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ క్రియాశీలకంగా లేకపోవడం, KTR ,కవిత మధ్య సమన్వయం లేకపోవడం పార్టీలో డొల్ల తనాన్ని బయటపెట్టి.. అధికార పక్షానికి ఆయుధంగా ఇచ్చినట్లే అవుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతూనే, పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం BRSకు ఉంది. లేదంటే, ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.