Anantha Padmanabha
భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడటానికి ఒక గొప్ప మార్గమని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం యొక్క గొప్పతనం గురించి, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అనంత పద్మనాభుడు(Anantha Padmanabha) అంటే ఎవరు ..అనంతుడు అంటే కాల స్వరూపుడు అని అర్థం. ఈ వ్రతంలో పూజించే అనంతపద్మనాభుడు పాల సముద్రంలో ఆదిశేషుడిపై శయనిస్తున్న విష్ణుమూర్తే. ఆయన బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన పాదాల వద్ద లక్ష్మీదేవి సేవ చేస్తుంటుంది. అంటే, ఆయన కాలంతో పాటు పద్నాలుగు లోకాలను ఏలే స్వరూపం అని అర్థం.
పురాణాల ప్రకారం, ఈ వ్రతం కామ్య వ్రతాలలో అత్యంత ముఖ్యమైనది. మహాభారత కాలంలో పాండవులు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించమని వారికి సూచించారని కథనం. ఈ వ్రతం సత్య ధర్మానికి, నిబద్ధతకు ప్రతీక. మనసులోని భయాలు, కష్టాలు, ఆందోళనలు తొలగిపోయి జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందని భక్తుల నమ్మకం.
ఈ వ్రతంలో 14 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చేతికి కట్టుకునే ఎర్రటి తోరంలో 14 ముడులు ఉంటాయి. నైవేద్యంలో 14 రకాల పండ్లు లేదా పిండివంటలు సమర్పిస్తారు. అలాగే, ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించి, ఆ తర్వాత ఉద్యాపన చేస్తారు.
పూజ కోసం దర్భలతో ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి, దాన్ని అనంతపద్మనాభుడి స్వరూపంగా భావించి పూజిస్తారు. కలశంలో పవిత్రమైన నీళ్లు, కొద్దిగా పాలు, పోకచెక్క, వెండి నాణెం ఉంచి యమునా దేవిని పూజిస్తారు.
ఈ వ్రతాన్ని ఆచరించే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. పూజామందిరాన్ని, ఇల్లును శుభ్రం చేసుకుని, అష్టదశ పద్మాన్ని ముగ్గులతో అలంకరిస్తారు. అనంతుడికి షోడశోపచార పూజలు చేసి, నైవేద్యంగా బెల్లంతో చేసిన అరిసెలు సమర్పిస్తారు. వ్రతం ముగిసిన తర్వాత చేతికి ఎర్రటి తోరాన్ని కట్టుకుంటారు.
ఈ వ్రతం సత్యధర్మాల ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఒక కథ ప్రకారం, ఒక ఆవు తన లేగదూడకు పాలు ఇచ్చి, “నేను నిన్ను తిరిగి వచ్చి కలుస్తాను” అని చెప్పి పులి దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో “సత్యమే మిన్న” అని చెప్పి, ఆవు తన సత్యధర్మాన్ని నిరూపించింది. ఈ కథ వ్రతం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది.
అనంతపద్మనాభ(Anantha Padmanabha) చతుర్దశి వ్రతం కేవలం సంపదలు, సుఖాలు, శాంతిని మాత్రమే కాకుండా, మన జీవితాన్ని సత్యం, ధర్మం అనే పునాదుల మీద నిలబెట్టుకోవడానికి ఒక మార్గాన్ని కూడా చూపిస్తుంది.