Anjaneya Swamy:పైకప్పు ఉండని హనుమంతుడి ఆలయం..ఇది ఎక్కడుంది?

Anjaneya Swamy: హనుమంతుడి విగ్రహం పెరుగుతూ ఉండటం వల్ల ఆంజనేయస్వామికి గోపురం నిర్మించడం సాధ్యం కావడం లేదని స్థానికులు చెబుతారు.

Anjaneya Swamy

తమిళనాడు నమక్కల్ జిల్లాలో వెలసిన ఆంజనేయ స్వామి(Anjaneya Swamy) ఆలయం ఒక మామూలు పుణ్యక్షేత్రం కాదు. ఎందుకంటే అది ప్రకృతికి, సైన్సుకు కూడా అంతుచిక్కని ఒక అద్భుతంగా నిలుస్తోంది. సుమారు 1500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి సుమారు 18 నుంచి 20 అడుగుల ఎత్తులో, ఏకశిలా విగ్రహంగా భక్తులకు దర్శనమిస్తాడు.

అయితే ఇక్కడి విశేషం హనుమంతుడి విగ్రహం ఎత్తు మాత్రమే కాదు, ఆ విగ్రహం రోజురోజుకూ కొద్దికొద్దిగా ఎత్తు పెరుగుతూ ఉండటమే. ఇది వినడానికి మనకు ఆశ్చర్యంగా అన్పిస్తున్నా ఇక్కడి భక్తులు, పూజారులు, స్థానికులు తరతరాలుగా ఇది కళ్లారా చూస్తున్నామని చెబుతున్నారు. హనుమంతుడి విగ్రహం పెరుగుతూ ఉండటం వల్ల ఆంజనేయస్వామికి గోపురం నిర్మించడం సాధ్యం కావడం లేదని చెబుతారు.

గతంలో ఎంతో మంది ఈ హనుమంతుడి విగ్రహం చుట్టూ మంటపాన్ని లేదా పైన కప్పును నిర్మించాలని ప్రయత్నించినా, ఏదో ఒక ఆటంకం ఎదురై ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటున్నాయట. ఆకాశమే హనుమంతుడికి గొడుగు అని, నిరంతరం పెరుగుతున్న స్వామిని ఏ గోపురము బంధించలేదని అక్కడి వారు విశ్వసిస్తారు. అందుకే ఎండనక, వాననక ఆకాశం కింద నీడలో ధీర గంభీరంగా ఆంజనేయుడు నిలబడి ఉంటాడు.

ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణగాథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహ స్వామి ఇక్కడి కొండల్లోనే కొలువుదీరగా, ఆ రూపాన్ని దర్శించుకోవడానికి ఆంజనేయుడు ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయంలో ఆంజనేయస్వామి చేతులు జోడించి, కళ్లు తెరిచి తన కంటిచూపుతో ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్న భంగిమలో భక్తులకు కనిపిస్తాడని అంటారు.

Anjaneya Swamy

ఇంకో విశేషం ఏంటంటే, ఆంజనేయస్వామి లాగే ఎదురుగా ఉన్న నరసింహుడి ఆలయానికి కూడా పైకప్పు ఉండదు. ఈ రెండు విగ్రహాలు ఒకదానికొకటి చూసుకుంటున్నట్లుగా ఉండటం భక్తులకు పరమ శాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శిస్తే మానసిక బలహీనతలు తొలగిపోయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా చెడు అలవాట్లకు బానిసైన వారు ఇక్కడ ఆంజనేయస్వామి(Anjaneya Swamy)ని ప్రార్థిస్తే త్వరగా బయటపడతారని నమ్ముతారు.

మరోవైపు 16వ శతాబ్దంలో రామచంద్ర నాయక్ నిర్మించిన నామగిరి కోట.. ఈ హనుమంతుడి ఆలయానికి సమీపంలోనే ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ అద్భుత క్షేత్రం, దైవిక శక్తితో పాటు.. వింతలకు కూడా నెలవుగా మారి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వేడుకల్లో ఈ ఆలయం భక్తజన సంద్రంగా విరాజిల్లుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version