Urine Infection
యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ అనేది చాలామందిలో ఎదురయ్యే ఒక విసుగు కలిగించే సమస్య. ఇది మూత్ర విసర్జన వ్యవస్థలో బాక్టీరియా ప్రవేశించడం వల్ల వస్తుంది. సాధారణంగా మనిషిలోని మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారు చేస్తుంటాయి. అది మూత్రనాళాల ద్వారా వెళ్లి మూత్రాశయంలోకి చేరుతుంది.
అయితే ఇలా ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఈ కోలి (E.coli) వంటి బాక్టీరియా ప్రవేశించి స్థావరాన్ని ఏర్పరచుకుంటే మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. దీనిని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. బాక్టీరియా పైకి పాకి మూత్రపిండాలను దెబ్బతీసే అవకాశముంటుంది కాబట్టి, మొదటి దశలోనే దీనిని గుర్తించాలని డాక్టర్లు చెబుతున్నారు.
యూరిన్ ఇన్ఫెక్షన్(Urine Infection) సమస్య రావడానికి ప్రధాన కారణం మన బాడీలో నీటి శాతం తగ్గిపోవడం. మనం శరీరానికి కావాల్సినంత నీరు తాగనప్పుడు మూత్రం చిక్కబడి, బాడీలోని వ్యర్థాలు బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతాయి. ఇదే బాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఫీసుల్లోనూ పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు అక్కడి అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది.
మహిళల్లో మూత్రనాళం పొడవు తక్కువగా ఉంటుంది. దీని వల్ల బాక్టీరియా త్వరగా మూత్రశయంలోకి చేరుతుంది. దీనివల్లే పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్లు, గర్భిణీలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
అయితే ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీరం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రం విసర్జించేటప్పుడు తీవ్రమైన మంట, నొప్పి కలగడం దీని ప్రాథమిక లక్షణం. తరచుగా మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది. అలా వెళ్లినప్పుడు కేవలం కొన్ని చుక్కలు మాత్రమే రావడం, అప్పుడు కూడా అసౌకర్యంగా ఉండటం జరుగుతుంది.
అంతేకాదు మూత్రం ముదురు రంగులోకి మారడం, మబ్బుగా కనిపించడం కూడా దీని లక్షణాలే. అలాగే మూత్రం విపరీతమైన దుర్వాసన రావడం కూడా ఇన్ఫెక్షన్ కి నిదర్శనమే. ఒకవేళ ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగితే మాత్రం పొత్తి కడుపులో నొప్పితో పాటు నడుము వెనుక భాగంలో నొప్పి రావచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ కిడ్నీల వరకు వెళ్తే మాత్రం జ్వరం, వణుకు,వాంతులు కూడా అవుతాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్(Urine Infection)ను తగ్గించుకోవడానికి మొదటి సూత్రం మంచి నీళ్లు ఎక్కువగా తాగడం. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం వల్ల మూత్రం పల్చబడి.. బాక్టీరియాను ఫోర్స్‌గా బయటకు తోసేస్తుంది. ఇటు ఆహారంలో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్‌ను చేర్చుకోవడం వల్ల కూడా బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మూత్రనాళంలో మంట తగ్గుతుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్ కానీ విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రనాళ గోడలకు బాక్టీరియా అతుక్కోకుండా ఉంటుంది. అలాగే పర్సనల్ హైజీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోదుస్తుల విషయంలో కాటన్‌వి ఎంచుకోవడం వల్ల తేమ చేరకుండా బాక్టీరియా పెరుగుదలను అరికట్టొచ్చు. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గకపోతే మాత్రం వెంటనే డాక్టరును సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.
