Money Plant
మన ఇళ్లలో లేదా ఆఫీసులలో డెకరేషన్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే మొక్కలలో మనీ ప్లాంట్(Money Plant) మొదటి వరుసలో ఉంటుంది. పేరులోనే మనీ ఉండటం వల్ల ఈ మొక్కను పెంచితే ఇంట్లో సిరిసంపదలు వస్తాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్(Money Plant) కేవలం ఒక మొక్క మాత్రమే కాదట, అది ఇంట్లోని సానుకూల శక్తిని ప్రభావితం చేసే ఒక సాధనం అంటారు. అందుకే దీనిని సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచకపోతే ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోగా, అనవసరమైన ఖర్చులు , మానసిక ఆందోళనలు పెరిగే అవకాశముందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనీ ప్లాంట్ విషయంలో చాలా మంది చేసే మొదటి తప్పు దానిని తప్పుడు దిశలో ఉంచడమేనట. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో (నార్త్-ఈస్ట్) పెట్టకూడదట. ఈ దిశ బృహస్పతికి సంబంధించింది అలాగే మనీ ప్లాంట్ శుక్రుడికి చిహ్నం. ఈ రెండు గ్రహాల మధ్య వైరం ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో ఈ మొక్క ఉంటే ఇంట్లో గొడవలు, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉందట.
మనీ ప్లాంట్‌కు అత్యంత అనువైన దిశ ఆగ్నేయం (సౌత్-ఈస్ట్). ఈ దిశ గణపతికి , శుక్రుడికి ఆవాసం కాబట్టి ఇక్కడ ఈ మొక్కను ఉంచితే అడ్డంకులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. ఒకవేళ ఆగ్నేయంలో వీలు కాకపోతే ఉత్తర దిశలో కూడా ఉంచుకోవచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనీ ప్లాంట్ ఎప్పుడూ పైకి పాకాలి కానీ కిందకు వేలాడినట్లు ఉండకూడదు. తీగలు నేలకు తగులుతుంటే అది ఆర్థిక పతనానికి సింబల్‌గా భావిస్తారు. అందుకే తీగలు పైకి వెళ్లేలా మొక్కకు ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. అలాగే మొక్కలోని ఆకులు ఎండిపోయినా, పసుపు రంగులోకి మారినా వాటిని వెంటనే తొలగించేయాలి.
ఎండిపోయిన ఆకులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. చాలా మంది మనీ ప్లాంట్‌ను ఇంటి బయట లేదా వరండాలో పెంచుతుంటారు, కానీ వాస్తు ప్రకారం దీనిని ఇంటి లోపల పెంచడమే మంచిదట. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి గదిలో ఒక మూల ఉంచినా చక్కగా పెరుగుతుంది.
అలాగే మనీ ప్లాంట్ పెంచే కుండీ లేదా బాటిల్ కలర్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. ఆకుపచ్చ, నీలం రంగు పాత్రలలో ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఎరుపు , ముదురు రంగులను వాడకపోవడం మంచిది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..మనీ ప్లాంట్‌ను ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వకూడదట. అలాగే ఇతరుల దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోకూడదట.
దీని వల్ల మీ ఇంట్లోని లక్ష్మీదేవి వేరే చోటికి వెళ్లిపోతుందని కొందరు నమ్ముతారు.
నమ్మకాలు ఎలా ఉన్నా, ఒక మొక్కను ప్రేమగా పెంచడం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. సరైన వాస్తు నియమాలు పాటిస్తూ మనీ ప్లాంట్‌ను పెంచితే అది కేవలం అందాన్ని మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
Arava Sridhar:ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిందితుడా? అమాయకుడా? వారం రోజుల్లో నిజం తేలుతుందా?
