Goddess Varahi
మన పురాణాల్లో శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిగా కొలువబడే ఈ దేవతలలో వారాహి మాతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వరాహావతారం యజ్ఞ స్వరూపం. సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన వరాహమూర్తిలాగే, వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగలదు. ఈమెను అతి బలవత్తరమైన శక్తిగా, సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగల దేవతగా భక్తులు నమ్ముతారు.
వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి(Goddess Varahi) అని పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం వంటి గ్రంథాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి మాత పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె రూపాన్ని గమనిస్తే, నల్లని మేఘవర్ణంలో, వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. శంఖం, పాశం, నాగలి, గునపం వంటి ఆయుధాలతో పాటు అభయవరద హస్తాలతో దర్శనమిస్తుంది. ఆమె వివిధ వాహనాలైన గుర్రం, సింహం, పాము, దున్నపోతులపై సంచరిస్తుంది.
వారాహి మాత(Goddess Varahi)ను ఎక్కువగా రాత్రివేళల్లో పూజిస్తారు. అందుకే ఈమె తాంత్రికులకు ఇష్టమైన దేవత. దేశంలోని చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపూర్ వంటి ప్రసిద్ధ ఆలయాలలో రాత్రివేళల్లో లేదా తెల్లవారుజామున మాత్రమే ఈమె దర్శనం ఉంటుంది. వారాహి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా, దండనాధగా వర్ణించబడింది. అందుకే లలితాసహస్రనామంలో కూడా ఈమె పేరు ప్రస్తావించబడింది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైన త్వరగా పూర్తవుతాయి.
వారాహి దేవి (Goddess Varahi )పార్వతీ దేవి మాతృక అని శాక్తేయులు నమ్ముతారు. దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు ఈ మాతృకను సృష్టించింది. ఈమెను వరహాజనని, క్రితంత తనుసంభవ (మృత్యుసమయంలో వచ్చే శక్తి)గా కూడా వర్ణిస్తారు. ఈమె వాహనం ఎనుము, పాశం ధరించి ఉండడం ఈ వాదనను బలపరుస్తుంది. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుందని నమ్మకం. మొత్తానికి, వారాహిదేవిని భక్తితో ఆరాధించిన వారికి సకల విజయాలు, ధైర్యం, శక్తి లభిస్తాయని చెబుతారు. సమస్యలను వేళ్ళతో పెకిలించే అతి బలవత్తరమైన శక్తిగా నమ్ముతారు.