Durgamma : బెజవాడ కనక దుర్గమ్మ నవరాత్రుల షెడ్యూల్ ఇదే..
Durgamma : శరన్నవరాత్రులలో ప్రతి రోజు అమ్మవారు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించనున్నారు.

Durgamma : పవిత్ర శరన్నవరాత్రుల వేళ, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీ కనక దుర్గమ్మ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందనుంది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, కనకదుర్గమ్మ దేవి ఈసారి 11 రోజుల పాటు 11 అద్భుతమైన అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఈ దసరా ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి.
Durgamma
ఆలయ ఈఓ శ్రీ శినా నాయక్, వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ సమక్షంలో ఈ నవరాత్రుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. కాగా ఈ శరన్నవరాత్రులలో ప్రతి రోజు అమ్మవారు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించనున్నారు.
సెప్టెంబర్ 22 (మొదటి రోజు): బాలత్రిపుర సుందరి దేవి – నవరాత్రులకు శ్రీకారం చుడుతూ, సృష్టికి మూలమైన పసిప్రాయపు అమ్మవారి రూపంలో దర్శనం.
సెప్టెంబర్ 23 (రెండవ రోజు): గాయత్రీ దేవి – వేదమాతగా, జ్ఞానప్రదాయినిగా అమ్మవారి దర్శనం.
సెప్టెంబర్ 24 (మూడవ రోజు): అన్నపూర్ణాదేవి – లోకాలకు అన్నం ప్రసాదించే తల్లిగా, సంపదలకు అధిష్టాన దేవతగా దర్శనం.
సెప్టెంబర్ 25 (నాల్గవ రోజు): కాత్యాయని దేవి – దుష్టసంహారిణిగా, భక్తులకు అభయమిచ్చే రూపంలో దర్శనం.
సెప్టెంబర్ 26 (ఐదవ రోజు): మహాలక్ష్మి – ఐశ్వర్య దేవతగా, సిరిసంపదలను ప్రసాదించే రూపంలో దర్శనం.
సెప్టెంబర్ 27 (ఆరవ రోజు): లలితా త్రిపుర సుందరి దేవి – సౌందర్యానికి, శక్తికి ప్రతీకగా, పరమేశ్వరి రూపంలో దర్శనం.
సెప్టెంబర్ 28 (ఏడవ రోజు): మహాచండి దేవి – అపారమైన శక్తికి, రక్షణకు అధిష్టాన దేవతగా దర్శనం.
సెప్టెంబర్ 29 (ఎనిమిదవ రోజు): సరస్వతి దేవి – జ్ఞాన ప్రదాయినిగా, కళలకు అధిష్టాన దేవతగా దర్శనం. ఈ రోజు మూల నక్షత్రం కావడంతో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 గంటల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
సెప్టెంబర్ 30 (తొమ్మిదవ రోజు): దుర్గాదేవి – శక్తి స్వరూపిణిగా, దుర్గతులను తొలగించే తల్లిగా దర్శనం.
అక్టోబర్ 1 (పదవ రోజు): మహిషాసుర మర్దిని దేవి – దుష్టసంహారిణిగా, విజయాన్ని ప్రసాదించే రూపంలో దర్శనం.
అక్టోబర్ 2 (పదకొండవ రోజు – దసరా): రాజరాజేశ్వరి దేవి – సర్వలోకాలకు అధినేత్రిగా, రాజసౌందర్యంతో కూడిన రూపంలో దర్శనం.
అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:30 గంటలకు జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో జరిగే మనోహరమైన హంస వాహన తెప్పోత్సవంతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు తెరపడనుంది.
ఈ దసరా పండుగ వేళ, భక్తులందరూ అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని, సకల శుభాలు, సుఖసంతోషాలు పొందాలని పండితులు కోరుతున్నారు ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభను వీక్షించి, అమ్మవారి ఆశీస్సులు పొందడానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.