Devotion
కష్టం వచ్చిందంటే చాలు… చాలా మందికి ఒక్కసారిగా దేవుడుగుర్తొస్తాడు. సాధారణ రోజుల్లో పెద్దగా పట్టించుకోని భక్తి(Devotion), సమస్యలు మొదలయ్యాక మాత్రం గట్టిగా పట్టుకుంటుంది. ఇది కేవలం నమ్మకమా? లేక మన మైండ్‌లో జరిగే సహజమైన ప్రక్రియనా? సైకాలజీ దీనికి చాలా సింపుల్‌గా సమాధానం చెబుతుంది.
మన జీవితంలో కంట్రోల్ మన చేతిలో ఉన్నంతవరకు మనకు ఎవరూ అవసరం అనిపించరు. ఉద్యోగం బాగుంటే, ఆరోగ్యం బాగుంటే, సంబంధాలు సాఫీగా సాగితే “నేనే చేసుకుంటా” అన్న భావన ఉంటుంది. కానీ ఒక్కసారి పరిస్థితులు మన చేతులు దాటితే… అప్పుడు మనసు వెంటనే ఒక ఆధారాన్ని వెతుకుతుంది. అదే చోట చాలామందికి దేవుడు గుర్తొస్తాడు.
ఇది భయంతో పుట్టే ఆలోచన కాదు. భద్రత (Security) కోసం వచ్చే స్పందన. మన బ్రెయిన్ ఎప్పుడూ సేఫ్ జోన్ కోసం చూస్తుంది. కష్టకాలంలో ఆ సేఫ్ జోన్ దేవుడిగా మారుతుంది. “ఎవరో ఉన్నారు” అన్న భావన మన నర్వస్ సిస్టమ్‌ను శాంతింపజేస్తుంది. భయం తగ్గితే ఆలోచనలు కాస్త క్రమబద్ధంగా మారతాయి. పురాణాల్లో కూడా ద్రౌపది, గజేంద్రుడు, అర్జునుడు..వాళ్లందరూ చివరికి దేవుడిని పిలిచింది ఓడిపోయిన తర్వాతే.
గెలిచినప్పుడు కాదు. ఇక్కడ భక్తిని బలహీనతగా చూడకూడదు. నిజానికి అది ఒక మానసిక స్ట్రాటజీ (Mental Strategy). మనసు పూర్తిగా కూలిపోకుండా ఆపే ఒక రక్షణ కవచం. “అన్నీ అయిపోయాయి” అన్న స్థితిలో కూడా “ఇంకా ఏదో ఉంది” అని అనిపించడమే మనిషిని నిలబెడుతుంది.
కష్టకాలంలో చేసే భక్తి ఎక్కువగా నిజమైనది అవుతుంది. ఎందుకంటే అప్పట్లో మనం నటించం. ఆ సమయంలో చేసే జపం, ప్రార్థన మన మెదడులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. సైకాలజీ దీనిని “ఎమోషనల్ రిలీజ్” (Emotional Release) అంటుంది. దేవుడితో మాట్లాడుతున్నామనుకున్నా, మనం నిజానికి మన మనసుతోనే మాట్లాడుతున్నాం. అదే అసలు హీలింగ్. నిజమైన భక్తి అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా మనసును సరిగా ఉంచే అలవాటు.
దేవుడిని రోజూ గుర్తు పెట్టుకోవడం అంటే రోజూ గుడికి వెళ్లడమే కాదు. మన ప్రవర్తనను కాస్త నియంత్రించుకోవడం. కోపాన్ని తగ్గించడం. ఇతరుల బాధను గమనించడం. అప్పుడు కష్టం వచ్చినప్పుడు భక్తి(Devotion) కొత్తగా మొదలవదు. అప్పటికే అది మనలో భాగమై ఉంటుంది. అప్పుడు మనసు మరింత బలంగా స్పందిస్తుంది. భక్తి అంటే సమస్యలు మాయం చేయడం కాదు. భక్తి (Devotion)అంటే సమస్యల్లోనూ మనల్ని నిలబెట్టడం.
