Kartika Purnima
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం(Kartika Purnima) అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యంగా పరమశివుడిని, శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అపారమైన విశిష్టత ఉంది. ఈ రోజు చేసే దీపారాధన, నదీ స్నానాలు, ప్రత్యేక పూజల ద్వారా భక్తులకు అపారమైన పుణ్యఫలితాలు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం(Kartika Purnima)లో వచ్చే పౌర్ణమి రోజుకు అపారమైన విశిష్టత ఉంది. ఈ రోజు ముఖ్యంగా శివుడిని అలాగే విష్ణువును ఆరాధించడం ద్వారా భక్తులకు అపారమైన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలుచెబుతాయి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి వ్రతాన్ని నవంబర్ 5, 2025 న ఆచరించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.
పంచాంగం ప్రకారం, పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 గంటలకు మొదలై, నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం నవంబర్ 5నే ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ రోజునే పండుగ ఆచరణకు ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన శుభ సమయాలు
భక్తులు ఈ పవిత్ర దినాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనువైన ముహూర్తాలు , ఆచారాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
నదీ స్నానం (బ్రహ్మ ముహూర్తం): నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో లేదా శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి. ఈ సమయంలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగి, పుణ్యం దక్కుతుందని విశ్వాసం.
ఉదయకాల పూజా సమయం: ఉదయం 7:58 నుంచి 9:00 వరకు శివార్చన , విష్ణు ఆరాధన ఆచరించడానికి, అలాగే పౌర్ణమి వ్రత పూజలు నిర్వహించడానికి అనువైన శుభ ముహూర్తం ఇది.
సాయంత్ర దీపారాధన (ప్రదోష కాలం): సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు గల ప్రదోష కాలం దీపారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో 365 వత్తులతో దీపం మరియు ఉసిరి దీపం వెలిగించడం అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
365 వత్తుల దీపారాధన – విశిష్ట ఫలితం..కార్తీక పౌర్ణమి(Kartika Purnima) రోజు 365 వత్తులు వెలిగిస్తే, ఏడాది పొడవునా 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. భక్తులు ఉపవాసం ఉండి ఈ దీపారాధన చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.
ఉసిరికాయ దీపం.. సాయంత్రం పూట ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ ఆచారంతో ధనలాభం, సౌభాగ్యం దక్కుతాయి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా ఈ మాసంలో ఎంతో విశేషమైనది.
దీపం వెలిగించే నియమాలు.. దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా నియమాలు పాటించాలి. వత్తులను వెలిగించడానికి అగ్గిపుల్ల లేదా కొవ్వొత్తిని ఉపయోగించకూడదని అగరబత్తితో మాత్రమే వత్తులను వెలిగించాలని పెద్దలు చెబుతారు. ఇంటి యజమాని స్వయంగా దీపారాధన చేయడం ఉత్తమం. దీపాలు వెలిగించిన తర్వాత అక్షింతలు చల్లుతూ “దామోదరం ఆవాహయామి” లేదా “త్రయంబకం ఆవాహయామి” అని ఉచ్చరించాలి. ఈ పవిత్ర ఆచారాల ద్వారా భక్తులు శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందుతారు.
