Lord Krishna
భారతీయ సినీ చరిత్రలో పురాణ గాథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి అదే పురాణాల నుంచి, శ్రీ కృష్ణుడి(Lord Krishna)ని ఇప్పటివరకూ ఎవరూ చూడని కోణంలో ఆవిష్కరించేందుకు “శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా” అనే ఒక భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఆగస్టు 15, 2025న ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఆగస్ట్ 16న కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేసి, మేకర్స్ ప్రేక్షకులకు ఒక గొప్ప కానుకను అందించారు. ఈ పాన్-వరల్డ్ స్థాయి చిత్రానికి దర్శకుడు, కథ, స్క్రీన్‌ప్లేను ముకుంద్ పాండే అందిస్తున్నారు. గతంలో ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’, ‘మనం’ వంటి చిత్రాలకు రచన, సమర్పణలో తనదైన ముద్ర వేసిన ముకుంద్ పాండే, చారిత్రక, పురాణ గాథలను ఆధునిక దృక్పథంతో చెప్పడంలో ప్రసిద్ధులు.
ఈ చిత్రం నేపథ్యం 11-12వ శతాబ్దాల నాటి మహోబా ప్రాంతం. రాజపుత్ మరియు బుందేల వీరుల ఆశయాలు, త్యాగాలు, వైరాగ్యం వంటి అంశాలను ఈ కథకు మూల స్తంభాలుగా నిలుపుతున్నారు. ఈ చిత్రంలో శ్రీ కృష్ణుడి(Lord Krishna)ని కేవలం భగవంతుడిగా కాకుండా, యుద్ధవీరుడిగా, ఒక ధైర్యవంతుడైన యోధుడిగా, ధర్మం కోసం నిలబడే రాజనీతిజ్ఞుడిగా చూపించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇది భారతీయ చిత్ర చరిత్రలోనే ఒక వినూత్న ప్రయత్నమని చెప్పవచ్చు.
అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు భాగస్వామ్యం కానున్నారు. కెమెరా, మ్యూజిక్, గ్రాఫిక్స్ వంటి సాంకేతిక అంశాలకు అత్యుత్తమ నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రం కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని వివిధ భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా భారతీయ పురాణ కళా సంపదను, చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం నటీనటుల సెలక్షన్ జరుగుతోంది. 2025 చివరి నాటికి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రపంచ స్థాయి వీఎఫ్‌ఎక్స్, మ్యూజిక్ బృందాలతో కలిసి ఒక అద్భుతమైన విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం కేవలం ఒక పౌరాణిక కథ కాదు, శ్రీ కృష్ణుడి(Lord Krishna) బహుముఖ వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని, ధర్మబద్ధ పాలనను ప్రతిబింబించే ఒక పోరాటగాథ. చరిత్ర, ఆధ్యాత్మికత యుద్ధ విలువలను సమర్థవంతంగా కలిపి చెప్పే ఈ భారీ బడ్జెట్ మూవీ..పోస్టర్ రిలీజ్‌తోనే సినీ పరిశ్రమలో, ప్రేక్షకులలో గొప్పక్యూరియాసిటీని పెంచేసింది.