Tirumala
వరుస సెలవులు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వేలాది మంది భక్తులు తరలిరావడంతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం ప్రారంభంలో దర్శనానికి 24 గంటల సమయం పట్టగా, అనూహ్యంగా భక్తుల రద్దీ భారీగా పెరగడంతో క్యూలైన్లు, కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్ల వెలుపల ఏకంగా 5 కిలోమీటర్లకు పైగా భక్తులు వేచి ఉన్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మరింత అప్రమత్తమైంది.
మరోవైపు శ్రీవాణి టికెట్ల జారీలో ఈరోజు గందరగోళం ఏర్పడింది. తిరుమల తిరుపతి (Tirumala Tirupati) దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉండగా, ఇప్పుడు నేరుగా అదే రోజు టికెట్లను జారీ చేస్తున్నారు. ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రం దర్శనం ఉంటుంది.
వారాంతం కావడంతో శ్రీవాణి టికెట్ల కోసం శనివారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, రద్దీ అధికంగా ఉండటంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే అధికారులు టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది. టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు వారికి సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది. టీటీడీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నిస్తోంది. కానీ, రికార్డు స్థాయిలో ఉన్న భక్తుల రద్దీని తట్టుకోవడం వారికి సవాలుగా మారింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం, సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. దీనిపై తిరుమల(Tirumala) వీధుల్లో ప్రచారం చేస్తూ, కొత్తగా వచ్చే భక్తులు ఈ నిరీక్షణకు సిద్ధపడి రావాలని సూచిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న చాలామంది భక్తులు రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ వస్తామని చెబుతూ వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.
Also Read: Sri Krishna Janmashtami: ఆగస్టు 16 శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎందుకు జరుపుకోవాలి