Ratha Saptami:రథసప్తమి విశిష్టత ..స్నానం చేసే పద్ధతి..పూజ ఎలా చేయాలో తెలుసా?

Ratha Saptami: సాధారణంగా సప్తమి తిథి ఆదివారం తోడైతే దానిని భాను సప్తమి అంటారు. అది రథసప్తమి రోజే రావడం వల్ల భక్తులకు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది.

Ratha Saptami

భూమిపై నివసించే సమస్త జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి స్వరూపం ..సూర్యభగవానుడు అని అందరికీ తెలిసిందే. అందుకే హిందూ ధర్మంలో సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.ఎందుకంటే సూర్యుడు లేనిదే సృష్టి లేదు..జీవనం లేదు. అటువంటి సూర్యదేవుడు జన్మించిన పవిత్రమైన రోజే ఈ రథసప్తమి. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు.

ఈ ఏడాది 2026 జనవరి 25వ తేదీ ఆదివారం రోజు రథసప్తమి(Ratha Saptami) రావడమనేది.. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యోగం. సాధారణంగా సప్తమి తిథి ఆదివారం తోడైతే దానిని భాను సప్తమి అంటారు. అది రథసప్తమి రోజే రావడం వల్ల భక్తులకు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈ రథసప్తమి రోజు సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించి ఉత్తరాయణ ప్రయాణాన్ని వేగవంతం చేస్తారు. ఈ మార్పు వల్ల ప్రకృతిలో వేడి పెరుగుతుందని.. పంటలు పండటానికి అవసరమైన శక్తి లభిస్తుందని పండితులు చెబుతారు.

రథసప్తమి(Ratha Saptami) రోజు చేసే స్నానానికి శాస్త్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా జిల్లేడు ఆకులు, రేగు పండ్లను తల మీద ఉంచుకుని స్నానం చేయాలని చెబుతారు. జిల్లేడును అర్క పత్రం అని కూడా అంటారు, సూర్యుడికి అర్క అని మరో పేరు ఉంది.అందుకే ఈ ఆకులకు సూర్యరశ్మిలోని ఔషధ గుణాలను గ్రహించే శక్తి ఉంటుందని నమ్మకం.

ఏడు జిల్లేడు ఆకులను, ఏడు రేగు పళ్లను శిరస్సుపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల ఏడు జన్మల నుంచి మనల్ని వెంటాడుతున్న పాపాలు, రోగాలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పురాణాలలో ఉంది. తెల్లవారుజామున 05:26 నుంచి 07:13 గంటల లోపు స్నానం చేయడం చాలా మంచిది.

తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన పొరపాట్లు, మనసుతో గాని మాటతో గాని ఇతరులను ఇబ్బంది పెట్టిన దోషాలు అన్నీ కూడా ఈ పవిత్ర స్నానంతో హరిస్తాయని ధర్మసింధు వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి. స్నానం చేసేటప్పుడు సూర్య దేవుని స్మరిస్తూ శ్లోకాలు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతాయి.

Ratha Saptami

ఇక పూజ విషయానికి వస్తే, తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని సూర్యకిరణాలు పడే చోట రంగురంగుల ముగ్గులు వేయాలి. అక్కడ చిక్కుడు ఆకులతో ఒక చిన్న రథాన్ని తయారు చేసి సూర్య భగవానుడిని ప్రతిష్టించాలి. పిడకలమీద ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి, అది పొంగి కింద పడేటట్లు చేస్తారు, ఇది వంశాభివృద్ధికి సంకేతంగా భావిస్తారు . అలా వండిన ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలోనే సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ రోజ ఎర్రటి పూలతో పూజించడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారు సూర్య ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. దానధర్మాలకు కూడా ఈ రోజు చాలా ప్రాముఖ్యత ఉంది. గొడుగులు, పాదరక్షలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.

Davos:దావోస్ 2026- తెలంగాణ రైజింగ్..హైదరాబాద్‌కు బడా కంపెనీల క్యూ..!

Exit mobile version