Davos
తెలంగాణ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos)వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సాధించిన విజయాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయి.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఉంచడం ద్వారా వేల కోట్ల పెట్టుబడులను సాధించడంలో ప్రభుత్వం సఫలమైనట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో భారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక గొప్ప ముందడుగు అనే చెప్పాలి.
ఈ పర్యటనలో కుదిరిన అత్యంత కీలకమైన ఒప్పందాల్లో.. లోరియల్ కంపెనీ ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ ఏఐ బ్యూటీ టెక్ హబ్ ఒకటి. ప్రపంచంలోనే మొదటిసారిగా అటువంటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడం భాగ్యనగరం ప్రతిష్టను పెంచుతుంది. దీని ద్వారా దాదాపు రెండు వేల మంది టెక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు ఉపాధి లభిస్తుంది.
దీంతోపాటు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ పియర్సన్ కూడా ..తెలంగాణలోని గ్లోబల్ ఏఐ అకాడమీతో కలిసి పనిచేయడానికి అంగీకరించింది. ఇది తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందిస్తుంది.
అటు విద్యుత్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. హైదరాబాద్ పెరుగుతున్న కరెంట్ అవసరాలను తీర్చడానికి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరిగాయి, ఇది స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి దారి తీస్తుంది.
అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు నివిడియా, యూనిలివర్ వంటివి కూడా.. తమ అంతర్జాతీయ కార్యకలాపాల కేంద్రాలను భాగ్యనగరంలో ఏర్పాటు చేయబోతున్నాయి. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ రెడీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఐదు వేల కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప పరిణామంగా చెప్పొచ్చు.
వీటితో పాటు విమానయాన రంగంలో మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు కూడా తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందాలు కుదిరాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా క్రీడలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో టాటా వంటి సంస్థలు ఆసక్తి చూపడం విశేషం.
ప్రతి ఏటా హైదరాబాద్‌లో దావోస్(Davos) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ ఎంతో మంది ఉపాధికి, మెరుగైన జీవన ప్రమాణాలకు చిరునామాగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Liver:మందు తాగకపోయినా లివర్ పాడవుతుందా? ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
