Lord Venkateswara
కలియుగ వైకుంఠవాసి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Lord Venkateswara) సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలలో స్వామివారికి జరిగే ప్రతి సేవ, ప్రతి అలంకారం అత్యంత పవిత్రమైనవి. ‘అలంకార ప్రియుడు’ అయిన శ్రీవారిని సుగంధ భరితమైన పూలమాలలతో అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పుష్పకైంకర్యం గురించి ప్రాచీన గ్రంథాలైన తిరువాయ్ మొళి వంటి గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.
స్వామి(Lord Venkateswara)వారికి అలంకరించే విశిష్ట పుష్పమాలలు..బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి అలంకరించే ప్రతి పూలమాలకూ ఒక ప్రత్యేకమైన పేరు, ప్రాముఖ్యత ఉన్నాయి. ఈ మాలలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, అవి స్వామివారి దివ్య స్వరూపానికి మరింత శోభను తెచ్చిపెడతాయి.
శిఖామణి: ఇది స్వామి (Lord Venkateswara)వారి కిరీటంపై నుంచి రెండు భుజాల మీదుగా అలంకరించే ఎనిమిది మూరల పొడవైన పూలమాల.
సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు ఇరువైపులా వేలాడే రెండు పొడవైన పూలమాలలు. ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరల పొడవు ఉంటాయి.
కంఠసరి: స్వామివారి కంఠం చుట్టూ అలంకరించే మూడున్నర మూరల పొడవైన దండ.
వక్షస్థల లక్ష్మి: శ్రీవారి వక్షఃస్థలంలో కొలువైన శ్రీదేవి, భూదేవులకు ప్రత్యేకంగా అలంకరించే రెండు పూలమాలలు. ఇవి ఒకటిన్నర మూరల పొడవు ఉంటాయి.
శంఖుచక్రం: శ్రీవారి చేతులలో ఉండే శంఖం, చక్రాలకు ప్రత్యేకంగా అలంకరించే రెండు పూలమాలలు. ఒక్కొక్కటి ఒక మూర పొడవు ఉంటాయి.
కఠారిసరం: శ్రీవారి చేతిలో ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. ఇది రెండు మూరల పొడవు ఉంటుంది.
తావళములు: స్వామివారి నడుము భాగం నుంచి మోకాళ్లు, పాదాల వరకు వేలాడే మూడు రకాల మాలలివి. వీటి పొడవులు మూడు మూరలు, మూడున్నర మూరలు, మరియు నాలుగు మూరలుగా ఉంటాయి.
తిరువడి దండలు: శ్రీవారి దివ్య పాదాల చుట్టూ అలంకరించే రెండు దండలు. ఇవి ఒక్కొక్కటి ఒక మూర పొడవుతో ఉంటాయి.
పూలంగి సేవ విశిష్టత..బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి గురువారం తిరుమల ఆలయంలో జరిగే పూలంగి సేవ అత్యంత విశిష్టమైనది. ఈ సేవలో స్వామివారి మూలమూర్తిపై ఉన్న అన్ని ఆభరణాలను తాత్కాలికంగా తీసివేసి, పైన పేర్కొన్న పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పుష్పాలతో మెరిసిపోతున్న స్వామివారిని దర్శించడం భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ సుగంధ భరితమైన పూలమాలలు శ్రీవారి దివ్య స్వరూపానికి మరింత శోభను తెచ్చిపెట్టి, భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి.