Harmanpreet Kaur
డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) పోరాటంతో చివరి వరకూ ఉత్కంఠగా సాగినా.. గుజరాత్ దే పైచేయిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. బెత్ మూనీ నిరాశ పరచడంతో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ ఆష్లే గార్డ్ నర్, అనుష్కశర్మలపై పడింది. వీరిద్దరితో పాటు సోఫీ డివైన్ కూడా రాణించింది.
అనుష్క శర్మ, సోఫీ డివైన్ రెండో వికెట్ కు 48 పరుగులు జోడించారు. అనుష్క 31 బంతుల్లో 33 , సోఫీ 21 బంతుల్లో 25 పరుగులు చేయగా.. తర్వాత గార్డనర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మంచి స్కోరు అందించింది. గార్డనర్ 46 పరుగులు చేయగా.. చివర్లో జార్జియా వరేహం భారీ షాట్లతో రెచ్చిపోయింది. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులతో అదరగొట్టింది. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి 5 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే ముంబై బౌలర్లు ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ అద్భుతమైన బౌలింగ్ తో 2 కీలక వికెట్లు తీసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ , నాట్ సీవర్ బ్రంట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో గుజరాత్ బౌలర్లు ఆరంభం నుంచే పైచేయి సాధించారు. ముంబై కీలక బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు. హీల్ మాథ్యూస్ , బ్రంట్ . సజీవన్ సజనా త్వరగానే ఔటవగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఒంటరిపోరాటం చేసింది. తర్వాతి బ్యాటర్లకు భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చేసింది.
ఆమెకు సపోర్ట్ ఇచ్చిన అమేలియా కెర్, అమన్ జోత్ కౌర్ కీలక సమయంలో ఔటవడంతో ముంబై విజయావకాశాలు దెబ్బతిన్నాయి. అయినా కానీ చివరి ఓవర్లో విజయం కోసం 26 పరుగులు చేయాల్సి ఉండగా.. హర్మన్ ప్రీత్(Harmanpreet Kaur) భారీ సిక్సర్లు కొట్టడంతో సంచలనం నమోదయ్యేలా కనిపించింది. అయితే గార్డనర్ ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టింది. దీంతో ముంబై 156 పరుగులే చేయగలిగింది. హర్మన్ ప్రీత్(Harmanpreet Kaur) 82 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.
