Vasant Panchami
మన హిందూ ధర్మంలో జ్ఞానానికి, విద్యకు, కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీ దేవిని పూజించే అత్యంత పవిత్రమైన రోజు.. వసంత పంచమి(Vasant Panchami). మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథి రోజు వచ్చే ఈ పండుగను 2026, జనవరి 23న జరుపుకుంటున్నాం.
వసంత ఋతువుకు స్వాగతం పలుకుతూ ప్రకృతి పులకించే ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికాసం కలుగుతుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు ఈ రోజును ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
అంతేకాదు వసంత పంచమి రోజున పసుపు రంగుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పసుపు రంగు జ్ఞానానికి, కొత్త ఆశలకు ప్రతీక. అందుకే ఈ రోజున పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలని పెద్దలు చెబుతారు.
పూజలో కూడా అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు, అక్షింతలు సమర్పించాలి. సరస్వతీ పూజలో పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
అయితే, ఈ పవిత్రమైన రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదని పండితులు చెబుతున్నారు. నలుపు అజ్ఞానానికి, ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు.. కాబట్టి దానికి దూరంగా ఉండాలని అంటున్నారు
అలాగే వసంత పంచమి (Vasant Panchami) రోజున పిల్లలకు ‘అక్షరాభ్యాసం’ చేయించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం. బాసర వంటి క్షేత్రాల్లో వసంత పంచమి రోజు వేల సంఖ్యలో పిల్లలకు చదువుల తల్లి ఆశీస్సులతో అక్షర దీక్ష ఇప్పిస్తారు.
ఇక ఈ రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమం ఆహారం. అమ్మవారి పూజ చేసేవారు అచ్చంగా శాకాహారం తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. . మనసులో ఎవరిపైనా ద్వేషం, క్రోధం లేకుండా రోజంతా ప్రశాంతంగా ఉండాలి.
ప్రకృతిని గౌరవిస్తూ మొక్కలకు హాని చేయకుండా ఉండటం కూడా ఈ పండుగలో అంతరార్థం అని పండితులు చెబుతారు. జ్ఞానమే సర్వస్వం అని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ వసంత పంచమిని (Vasant Panchami) భక్తిశ్రద్ధలతో జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం.
SIT:మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్.. కేసీఆర్‌కీ సిట్ నోటీసులు తప్పవా?
