SIT:మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్.. కేసీఆర్‌కీ సిట్ నోటీసులు తప్పవా?

SIT: శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు రావాలని అధికారులు నోటీసులు పంపారు.

SIT

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని నెలలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను తుఫానును సృష్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ (SIT) అధికారులు, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జనవరి 23 శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు రావాలని అధికారులు నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసుల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 20న (మంగళవారం) మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను, సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.

సాయంత్రం 6:30 గంటల వరకు సాగిన ఈ విచారణలో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. అయితే, విచారణ సమయంలో తన న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడంపై హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు.

విచారణ తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియాలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి సంబంధించిన సింగరేణి బొగ్గు టెండర్ల కుంభకోణాన్ని..తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యగా తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు.

విచారణలో కొత్త విషయాలేమీ అడగలేదని.. పాత విషయాలనే పదే పదే అడుగుతూ టైమ్ పాస్ చేశారన్న హరీష్ రావు. అధికారులకు మధ్యలో ఫోన్ కాల్స్ రావడం, వారు బయటకెళ్లి ఎవరితోనో మాట్లాడి రావడం చూస్తుంటే.. ఈ విచారణ అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందని అర్థమవుతోందని కొత్త అనుమానాలను తెరమీదకు తెచ్చారు.

SIT

అయితే హరీష్ రావు తర్వాత ఇప్పుడు కేటీఆర్ విచారణకు సిద్ధమవుతుండటం తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. కేటీఆర్ కూడా ..ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులకు సంబంధించిన అంశం, తమకేం సంబంధమని ప్రశ్నించారు.

అయితే, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. దర్యాప్తు సంస్థల తర్వాత అడుగు మాజీ సీఎం కేసీఆర్ వైపు పడే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మాత్రం, తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతాయి. అది బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆవేశాన్ని నింపడమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసే ప్రమాదం ఉంది.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ పరిణామాలను చట్టబద్ధంగా ,రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. న్యాయస్థానాల్లో ఈ కేసు నిలబడదని, గతంలోనే కోర్టులు దీనిపై వ్యాఖ్యలు చేశాయని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.

మొత్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ సీరియల్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..

Vijay:విజయ్ విజిల్ సౌండ్.. తమిళనాట అధికార పక్షానికి చెమటలు పట్టిస్తుందా?

Exit mobile version