T20 World Cup 2026
మరో 50 రోజుల్లో టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup 2026) మొదలుకానుంది. ఈ మెగా టోర్నీ కోసం 20 జట్లు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) కు శనివారం బీసీసీఐ జట్టును ప్రకటించనున్నారు. దీని కోసం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కానుంది.
ప్రస్తుతం సౌతాఫ్రికాపై ఆడుతున్న జట్టులో సంచలన మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మెగా టోర్నీ కావడంతో 15 మందితో పాటు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్స్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన స్థానాలను చూస్తే తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబేలకు ప్లేస్ ఖాయం. సంజూ శాంసన్ కు కూడా చోటు దక్కనుంది.
అయితే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా మాత్రం జితేశ్ శర్మకే టీమ్ మేనేజ్ మెంట్ ప్రాధాన్యతనిస్తోంది. ఇక టీ20 ఫార్మాట్ లోనూ మంచి ఫామ్ లో ఉన్న యశస్వి జైశ్వాల్ ను రిజర్వ్ గా ఎంపిక చేయొచ్చు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్ లో మళ్లీ ఫామ్ అందుకున్న ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ను విజేతగా నిలపడంతో పాటు వ్యక్తిగతంగానూ అదరగొట్టాడు.
రెండు సెంచరీలతో 500కు పైగా పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక నితీశ్ రెడ్డికి 15 మందిలో చోటు కష్టంగానే కనిపిస్తోంది. రిజర్వ్ ప్లేయర్స్ లో చోటు దక్కొచ్చు. నితీశ్ కు వాషింగ్టన్ సుందర్ గట్టిపోటీనిస్తున్నాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా రిజర్వ్ జాబితాలోనూ చోటు దక్కుతుందని భావిస్తున్నారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఉండడమే దీనికి కారణం.
బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు ఖాయం. స్పిన్ కోటాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు గ్యారెంటీగా ఎంపికవుతారు. కాగా టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. టోర్నీకి ముందు భారత్, న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. కివీస్ తో సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టే ప్రపంచకప్ లోనూ ఆడనుంది.
