Arjun Tendulkar
సచిన్ టెండూల్కర్ కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో అర్జున్ నిశ్చితార్థం నిన్న, ఆగస్టు 13న, ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ శుభకార్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, అభిమానులు, స్నేహితుల నుండి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సానియా చందోక్(Sania Chandhok) ఒక సాధారణ వ్యాపారవేత్త మాత్రమే కాదు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారి కుటుంబానికి హోటల్, ఆహార రంగాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి. ముంబైలోని ఇంటర్కాంటినెంటల్ హోటల్, ప్రఖ్యాత ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ వారి వ్యాపార సంస్థల్లో కొన్ని. ఈ వ్యాపార బాధ్యతలతో పాటు, సానియా స్వయంగా స్థాపించిన Mr. Paws Pet Spa & Store అనే సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2024లో ఆమె వెటర్నరీ టెక్నీషియన్ సర్టిఫికేషన్ కూడా పొందారు. సానియా, అర్జున్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. అంతేకాకుండా, అర్జున్ సోదరి సారా టెండూల్కర్‌తో కూడా ఆమెకు మంచి స్నేహం ఉంది.
25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ప్రస్తుతం గోవా డొమెస్టిక్ జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఒక సెంచరీతో 532 పరుగులు చేసి, 37 వికెట్లు పడగొట్టారు. అలాగే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 24 టీ20 మ్యాచ్‌లలో 27 వికెట్లు తీసి, 119 పరుగులు చేశారు. ఈ యువ క్రికెటర్ తన కృషి, పట్టుదలతో భారత క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.
క్రికెట్ మైదానంలో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోనూ ఒక కొత్త అడుగు వేశారు. సానియాతో అర్జున్ నిశ్చితార్థం జరిగిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. ఈ జంటకు అభిమానుల నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరి స్నేహం ఇప్పుడు పెళ్లి బంధంగా మారనుండటంతో సచిన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.