Vaibhav Suryavanshi
భారత క్రికెట్ యువ సంచలన వైభవ్ (Vaibhav Suryavanshi) సూర్యవంశీ రికార్డుల వేట కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టకముందే అన్ని ఫార్మాట్లలోనూ ఈ బుడ్డోడు ఇరగదీస్తున్నాడు. ఆడేది టీ20నా, వన్డేనా, రంజీనా అనే తేడా లేకుండా దుమ్మురేపుతున్నాడు. వైభవ్(Vaibhav Suryavanshi) దెబ్బకు రికార్డుల బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో నిరాశపరిచిన ఈ యువ సంచలనం 2 రోజుల వ్యవధిలోనే మళ్లీ విజయ్ హజారే టోర్నీ బరిలోకి దిగాడు.
దేశవాళీ వన్డే టోర్నీల్లో అత్యుత్తమంగా భావించే విజయ్ హజారేలో అరుణాచల్ ప్రదేశ్ పై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా మామూలుగా కాదు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ కూడా బాదేస్తాడేమో అనుకున్న దశలో దానికి 10 పరుగుల దూరంలో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చీ రాగానే బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 14 ఏళ్ల వైభవ్(Vaibhav Suryavanshi) దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ సీనియర్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. టీ20 మూడు నుంచి ఇంకా బయటపడలేదన్న తరహాలో వైభవ్ విధ్వంసం సాగింది.
ఒక ఫోర్.. డాట్.. మళ్లీ సిక్సర్.. ఇలా సాగింది సూర్యవంశీ బ్యాటింగ్ తీరు.. ఈ క్రమంలో విజయ్ హజారేలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. విజయ్ హజారే ట్రోఫీలోనూ, వన్డే క్రికెట్ లోనూ, లిస్ట్ ఏ క్రికెట్ లోన మూడింటిలోనూ అతిపిన్న వయసులో సెంచరీతో పాటు 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు అలాగే అతి తక్కువ బాల్స్ లో డబుల్ సెంచరీ రికార్డు సైతం బ్రేక్ చేసే క్రమంలో 190 రన్స్ కు ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 15 సిక్సర్లున్నాయి.
వైభవ్ (Vaibhav Suryavanshi)ధాటికి సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. గతంలో డివిలియర్స్ 64 బంతుల్లో 150 రన్స్ చేసి చరిత్ర సృష్టిస్తే… ఇప్పటి వరకు ఆ రికార్డు దగ్గరకు ఎవ్వరూ వెళ్లలేకపోయారు. టీ20ల్లో చాలా మంది హిట్టర్స్ ఉన్న ఏబీడీ రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. అయితే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దెబ్బకు డివీలియర్స్ రికార్డ్ బద్దలయింది.
వన్డేల్లో 222 ప్లస్ స్ట్రైక్ రేట్ ఇలాంటి విధ్వంసం చూడడం క్రికెట్ ప్రపంచానికి ఇదే తొలిసారి. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ, అండర్ 19లోనూ, భారత్ ఏ జట్టు తరపున వైభవ్ (Vaibhav Suryavanshi)విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఆడుతోంది స్వదేశీ పిచ్ లపైనా, విదేశీ పిచ్ లపైనా అనే తేడా లేకుండా అతని పరుగుల వేట కంటిన్యూ అవుతోంది.
ఐపీఎల్ అరంగేట్రంలోనే అతి పిన్నవయసులో సెంచరీ బాదేసిన వైభవ్ తర్వాత రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ , ఆస్ట్రేలియా టూర్ , అండర్ 19 ఆసియాకప్ లోనూ రికార్డుల మోత మోగించాడు. డొమెస్టిక్ క్రికెట్ టోర్నీల్లో అదే జోరు కంటిన్యూ చేయగలడా అన్న అనుమానాలను తెరదించుతూ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాదిలోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తాడని భావిస్తున్నారు.
