Cricket
టీమిండియా ఇప్పుడు వైట్ బాల్ సిరీస్ కోసం రెడీ అయింది. నిన్నటి వరకూ వెస్టిండీస్ తో రెడ్ బాల్ క్రికెట్(Cricket) ఆడిన భారత్ 2-0తో సిరీస్ ను స్వీప్ చేసింది. ఇప్పుడు ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ ఆస్ట్రేలియా టూర్ కు బయలుదేరిపోయింది. కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ వన్డేల్లో సారథిగా తన ప్రయాణాన్ని ఈ టూర్ నుంచే మొదలుపెట్టనున్నాడు. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకాబోతోంది. అయితే ఈ సిరీస్ లో అందరి చూపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే అందరి చూపు ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోకో ద్వయం మళ్ళీ ఇప్పుడే భారత తరపున గ్రౌండ్ లో అడుగుపెడుతున్నారు.
ఎందుకంటే వీరిద్దరూ గత ఏడాది టీ ట్వంటీలకు, ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికేశారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలన్నది ఇద్దరి టార్గెట్. మరి అప్పటి వరకూ వీరిద్దరూ తమ ఫామ్, ఫిట్ నెస్ కాపాడుకుంటారా అనేదే చూడాలి. అదే సమయంలో వరల్డ్ కప్ ప్లాన్స్ లో వీరిద్దరూ ఉన్నారా లేరా అన్న సందేహాలకు చీఫ్ సెలక్టర్ అగర్కార్, కోచ్ గంభీర్ సైతం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం వర్తమానం గురించి ఆలోచిద్దామంటూ గంభీర్ మాటలను చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి.
అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రోహిత్, కోహ్లీ ఇద్దరికీ కీలకమే. ఎందుకంటే ఈ సిరీస్ లో చెలరేగితే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కినట్టేనని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రోహిత్, కోహ్లీ ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతోంది. పైగా హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లు ఒక్కొక్కరుగా జట్టును వీడుతున్నారు. కోహ్లీ, రోహిత్ సైతం టెస్ట్ ఫార్మాట్ రిటైర్మెంట్ విషయంలో గంభీర్ ఒత్తిడితోనే నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో గంభీర్ యువక్రికెటర్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. సుధీర్ఘ లక్ష్యాలతో జట్టును సన్నద్ధం చేస్తున్నట్టు గతంలోనే చెప్పేశాడు. దీంతో సీనియర్ల కెరీర్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి.
మరోవైపు కోహ్లీ, రోహిత్ లకు కూడా ఆసీస్ టూర్ ప్రాధాన్యత తెలుసు. ఈ(Cricket) సిరీస్ లో అదరగొడితే మాత్రం గంభీర్ కు వీరిని తప్పించేందుకు కారణాలు ఇక ఉండవు. ఒకవేళ ఫెయిలైతే మాత్రం బీసీసీఐ సెలక్టర్లు కూడా పునరాలోచనలో పడతారు. అందుకే వారికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రోకో ద్వయం కంగారూ గడ్డపై రెచ్చిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫిట్ నెస్ విషయంలో మరింత అప్రమత్తమైన రోహిత్ ఇటీవలే 10 కేజీలు బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. అటు ఫిట్ నెస్ విషయంలో కోహ్లీకి ఎలాంటి ఇబ్బందులు లేవు.