Harmanpreet
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. నమోదవడమే కాదు ప్రత్యర్థి జట్లు అలవోకగా చేధించేస్తున్నాయి. పురుషుల జట్లకు ఈ మాత్రం తగ్గేదే లేదంటూ మహిళా క్రికెటర్లు టీ ట్వంటీ లీగ్ లోనూ దుమ్ము రేపుతున్నారు. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపుగా రికార్డు స్థాయి స్కోర్ చేసింత పని చేయగా.. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా 190 ప్లస్ స్కోర్ టార్గెట్ ను చేజ్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్ తో మరో విజయాన్ని అందుకుంది.
గుజరాత్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ మెరుపులు మెరిపించింది. ఆ జట్టు బ్యాటర్లు వేర్‌హామ్ , కనిక అహుజా , భార్టి ఫుల్మాలి రెచ్చిపోయి ఆడారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది.
జార్జియా వేర్‌హామ్ 33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43, కనిక అహుజా 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35, భార్టి ఫుల్మాలి15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36 నాటౌట్, బెత్ మూనీ 26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33 రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నికోలా క్యారీ, అమెలియా కేర్ తలో వికెట్ తీసారు.
భారీ టార్గెట్ కావడంతో ముంబై దానిని అందుకోవడం కష్టమే అనుకున్నారు. పైగా 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో ఓపెనర్లు కమిలిని , మాథ్యూస్ ఔట్ అయ్యారు. ఇక ముంబై కోలుకోవడం అసాధ్యం అనుకున్న వేళ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. తన ఫామ్ కొనసాగిస్తూ అదరగొట్టింది.
భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించింది. హర్మన్‌ప్రీత్ (Harmanpreet) కౌర్ 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71 రన్స్ చేసింది. ఆమెతో పాటు అమన్‌జోత్ కౌర్ 26 బంతుల్లో 7 ఫోర్లతో 40, నికోలా క్యారీ 23 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేయడంతో ముంబై మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది .
అయితే ఆ తర్వాత ముంబై హై స్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. ఇక తాజా మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరింది. కాగా ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచిన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
