Ind Vs Aus: ఇలా చేసారేంటయ్యా.. రీఎంట్రీలో రోకో ఫ్లాప్

Ind Vs Aus: చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. సాధారణంగానే ఆస్ట్రేలియాతో భారత్ సిరీస్ ఆడుతుందంటే ఆసక్తి ఎంతో ఉంటుంది.

Ind Vs Aus

మన దేశంలో క్రికెట్ మతమైతే క్రికెటర్లు దేవుళ్లు… అభిమానులు వారిని దేవుళ్లలానే ఆరాధిస్తారు.. పిచ్చిగా ప్రేమిస్తారు.. ఇలా క్రేజ్ తెచ్చుకున్న వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుంటారు. ఎందుకంటే గత 15 ఏళ్ళ నుంచి భారత క్రికెట్ అంటే వీరిద్దరే… ఇద్దరూ జట్టుకు కెప్టెన్లుగా చేశారు. టన్నుల కొద్దీ పరుగులే కాదు ఎన్నో రికార్డులు కొల్లగొట్టారు. అయితే గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత పొట్టి క్రికెట్ కు, ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతం వన్డేలు, ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు.

అభిమానులు ముద్దుగా రోకో అని పిలుచుకునే రోహిత్, కోహ్లీ దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ బ్లూ జెర్సీలో కనిపించారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. చివరిసారిగా వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు ఆడారు.

Ind Vs Aus

చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. సాధారణంగానే ఆస్ట్రేలియాతో భారత్(Ind Vs Aus) సిరీస్ ఆడుతుందంటే ఆసక్తి ఎంతో ఉంటుంది. ఇప్పుడు రోహిత్ , కోహ్లీ కూడా రీఎంట్రీకి ఇదే సిరీస్ వేదికవడంతో ఈ ఆసక్తి చాలా పెరిగింది. అయితే ఎన్నో ఆశలతో రోకో బ్యాటింగ్ మెరుపులను చూద్దామని వచ్చిన అభిమానులకు పెర్త్ లో నిరాశే మిగిలింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ కేవలం 8 రన్స్ కే ఔటయ్యాడు. 14 బంతులు ఆడిన హిట్ మ్యాన్ ఒక బౌండరీ కొట్టినప్పటకీ క్రీజులో అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. హ్యాజిల్ వుడ్ బౌలింగ్ లో స్లిప్ ఫీల్డర్ రెన్షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్(Ind Vs Aus) కు ముందు తన ఫిట్ నెస్ విషయంలో బాగా ఫోకస్ పెట్టిన రోహిత్ 10 కేజీలు బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. వచ్చే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా ఈ సిరీస్ కోసం ప్రిపేరయిన రోహిత్ ఇలా ఔటవడం నిరాశపరిచింది.

Ind Vs Aus

మరోవైపు విరాట్ కోహ్లీ అసలు ఖాతానే తెరవలేదు. దాదాపు 8 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ డకౌటయ్యాడు. తన వీక్ నెస్ షాట్ కే అతను వెనుదిరిగాడు. ఔట్ సైట్ ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసిన బంతిని వెంటాడి పాయింట్ లో క్యాచ్ ఇచ్చాడు. మిఛెల్ స్టార్క్ తన పదునైన పేస్ తో కోహ్లీని డకౌట్ గా వెనక్కి పంపాడు.

ఇదిలా ఉంటే రీఎంట్రీలో రోకో ద్వయం ఇలా ఫ్లాప్ అవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇదే పేలవ ఫామ్ కొనసాగిస్తే మాత్రం వీరిద్దరి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని చెబుతున్నారు. హెడ్ కోచ్ గంభీర్ , చీఫ్ సెలక్టర్ అగార్కర్ వీరిద్దరి ఫ్యూచర్ పై హామీ ఇవ్వలేకపోతున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version