Ind Vs Sa
టెస్ట్ సిరీస్ ఓటమికి సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్(Ind Vs Sa) అడుగుదూరంలో నిలిచింది. తొలి వన్డే గెలిచిన టీమిండియా ఇప్పుడు రాయ్పూర్ వేదికగా రెండో మ్యాచ్ లోనూ అదరగొట్టి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రోహిత్, కోహ్లి సూపర్ ఫామ్ ఇక్కడ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. బౌలర్లు కాస్త గాడిన పడితే సఫారీలకు రెండో వన్డేలో చెక్ పెట్టి సిరీస్ ను ఖాతాలో వేసుకోవచ్చు.
నిజానికి తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసినా మిడిలార్డర్ వైఫల్యం మాత్రం ఇబ్బందికరంగా మారింది. కోచ్ గంభీర్ ప్రయోగాలు విఫలమవుతూనే ఉన్నాయి. రుతురాజ్ తో పాటు ఐదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ నిరాశపరిచాడు. దీంతో ఇదే కాంబినేషన్ ను కొనసాగిస్తారా లేక పంత్ కు చోటిస్తారేమో చూడాలి. ఇక తొలి వన్డేలో రోహిత్, కోహ్లి సూపర్ బ్యాటింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
రోహిత్ హాఫ్ సెంచరీతో మెరిస్తే.. కోహ్లి మాత్రం దుమ్ములేపాడు. తన ఫామ్పై ఇంకా అనుమానాలతో ఉన్న వారందరికీ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో జవాబిచ్చాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సైతం ఖాతాలో వేసుకున్నాడు. అటు రోహిత్ కూడా ఫామ్ కంటిన్యూ చేయడంతో రెండోవన్డేలోనూ రోకో జోడిపైనే అండరి చూపుంది. కెఎల్ రాహుల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆకట్టుకోగా.. జడేజా మెరుపులు మెరిపించాడు.
అయితే ఓపెనర్ జైశ్వాల్ మాత్రం రెండో వన్డేలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక భారత్కు తిరుగులేనట్టే. మరోవైపు బౌలింగ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో ప్రదర్శన లేదు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాజా వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చేశారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ మాత్రం మరోసారి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
అతనికి తోడు జడేజా కూడా తన మ్యాజిక్ చూపిస్తే నఫారీ బ్యాటర్లకు ఇక్కట్లు తప్పవు.ఇదిలా ఉంటే సిరీస్ చేజారకుండా ఉండాలంటే సౌతాఫ్రికా(Ind Vs Sa)కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరిగా మారింది. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ జోరుకు బ్రేక్ వేసి సిరీస్ ను సమం చేయాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. కెప్టెన్ బవుమా తిరిగి జట్టులోకి రాగా.. డికాక్ ప్లేస్ లో రికెల్టన్ కు చోటు దక్కొచ్చు.
బౌలింగ్ లో కేశవ్ మహారాజ్ కూడా రావడంతో సఫారీల బలం పెరిగినట్టే. అటు మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న రాయ్ పూర్ పిచ్ ను బ్యాలెన్సింగ్ గా రూపొందించినట్టు తెలుస్తోంది. సీమర్లకు, స్పిన్నర్లకు సమానంగా అనుకూలించే రాయ్ పూర్ పిచ్ పై బ్యాటర్లు తెలివిగా షాట్లు ఆడాల్సి ఉంటుంది.
