INDIA vs PAKISTAN
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్(INDIA vs PAKISTAN )మ్యాచ్ గురించి జరిగిన చర్చ మరే మ్యాచ్ కూ జరిగి ఉండదేమో… ఎప్పుడూ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగుతుందో అన్న దానిపై మాటలు, చర్చలు వినిపించేవి. కానీ ఈ సారి పాకిస్థాన్ ఓవరాక్షన్ కారణంగా బాయ్ కాట్ అంటూ చేసిన హంగామానే వార్తల్లో నిలిచింది. తమకు సంబంధం లేని అంశంలో జోక్యం చేసుకుని పాక్ బోర్డు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.
బంగ్లాదేశ్ కు మద్ధతుగా భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం అంటూ పాక్ బోర్డు ప్రకటించడం , దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం , బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు సైతం పాక్ బోర్డుపై మండిపడడం ఇలా వరుస పరిణామాలతోనే కాలం గడిచిపోయింది. మ్యాచ్ ఆడకుంటే దాదాపు 2 వేల కోట్ల వరకూ నష్టపరిహారం వసూలు చేస్తామంటూ ఐసీసీ, స్పాన్సర్లు హెచ్చరించడంతో అన్నీ మూసుకుని ఆడేందుకు అంగీకరించింది.ఈ వంకతో భారత్ పై కొన్ని డిమాండ్లు నెరవేర్చుకోవాలనుకున్న పాక్ బోర్డు ఆశలు కూడా నెరవేరలేదు. ఇంత హంగామా చేసిన పాకిస్థాన్ తర్వాత భారత్(INDIA vs PAKISTAN) ను ఓడించేస్తామంటూ ప్రగల్భాలు పలికింది.
గత రికార్డులను మరిచిపోయి అత్యుత్సాహంతో కొన్ని మాటలు కూడా మాట్లాడింది. వివాదాస్పద యాక్షన్ శైలి బౌలర్ ఉస్మాన్ తారిఖ్ తో భారత్ ను వణికిస్తామంటూ ఓ రేంజ్ లో హడావుడి చేసింది. కానీ మైదానంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎప్పటిలానే భారత్ ముందు పాక్ తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనిపించిన పాకిస్థాన్ బ్యాటింగ్ లో మాత్రం అత్యంత చెత్తగా ఆడింది.
ఈ ఆటతీరు చూసిన తర్వాత పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. భారత్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పాక్ అభిమానులు తమ జట్టును తిట్టిపోస్తున్నారు. కనీసం బ్యాట్ పట్టుకుని ఆడడం రానోళ్లు వరల్డ్ కప్ ఆడడం ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మాత్రం దానికి మ్యాచ్ ను బాయ్ కాట్ చేసి ఉంటే పరువు దక్కేది కదా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్ చేతిలో ఇంత చిత్తుగా ఓడిపోయి పరువు తీసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచకప్ లో పాక్ పై భారత్ దే ఎప్పుడూ ఆధిపత్యం. ఇది మరోసారి రుజువైంది. ఏ దశలోనూ భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వని పాక్ ఈ సారి కూడా చేతులెత్తేసింది. దీంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో పాక్ పై భారత్ తన రికార్డును 8-1కు పెంచుకుంది.
ఈ ఓటమితో పాక్ సూపర్ 8 అవకాశాలు కూడా రిస్క్ లో పడ్డాయి. చివరి మ్యాచ్ లో నమీబియాపై గెలిస్తేనే సూపర్ 8కు చేరుతుంది. దీంతో భారత్ ను ఓడించడం మీ వల్ల కాదు ముందు నమీబియాపై గెలవండి అంటూ టీమిండియా ఫ్యాన్స్ పాక్ ను ట్రోల్ చేస్తున్నారు.
