Riyan Parag : రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్..జడేజాను పట్టించుకోని ఫ్రాంచైజీ

Riyan Parag : రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి

Riyan Parag

ఐపీఎల్ 2026 సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకున్న పలు జట్లు తమ కెప్టెన్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం వెలువరించింది. వచ్చే సీజన్ లో తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా రియాన్ పరాగ్(Riyan Parag) ను ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

గ‌త సీజ‌న్ వ‌ర‌కు సారథిగా వ్యవహరించిన సంజూ శాంస‌న్ స్దానంలో పరాగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. ఈ సీజన్ వేలం ముగిసిన తర్వాత రాయల్స్ కొత్త కెప్టెన్సీ రేసులో జడేజా, జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించాయి. వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా సంజూను వదిలేసిన రాజస్థాన్ రాయల్స్ జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది. సీనియర్ ప్లేయర్ గా, మ్యాచ్ విన్నర్ గా పేరున్న జడేజాకే పగ్గాలు అప్పగిస్తారని భావించారు.

అయితే పరాగ్ వైపే రాయల్స్ మేనేజ్ మెంట్ మొగ్గచూపింది. రియాన్ ప‌రాగ్ 2019 నుంచి రాజ‌స్తాన్ జ‌ట్టుతో కొన‌సాగుతున్నాడు. గతంలో అస్సాం జట్టుకు, రాజస్థాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరించిన అనుభవం పరాగ్ కు ఉంది.

Riyan Parag

ఇదిలా ఉంటే గత సీజ‌న్‌లో సంజూ శాంసన్ గాయపడి 8 మ్యాచ్ లకు దూరమైనప్పుడు రియాన్ పరాగ్(Riyan Parag) నే కెప్టెన్ గా ఎంపిక చేశారు. అతని కెప్టెన్సీలో రాజస్థాన్ 8 మ్యాచ్ లకు కేవలం రెండింటిలోనే గెలిచింది. అయినా కోచ్ సంగక్కరా సూచనతో పరాగ్ ను సారథిగా ఎంపిక చేసారు. ఇదిలా ఉంటే రియాన్ పరాగ్ 2019లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ 84 మ్యాచ్ లలో 1566 పరుగులు చేశాడు. దీనిలో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు.

కాగా గత సీజన్ ముగిసినప్పటి నుంచీ రాజస్థాన్ ఫ్రాంచైజీలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ తో ఫ్రాంచైజీ యాజమన్యానికి విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. సంజూనే ఫ్రాంచైజీని వీడి వెళ్లిపోతానని అడిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. చివరికి చెన్నైతో ట్రేడింగ్ డీల్ కుదిరి సంజూ వెళ్లిపోగా.. జడేజా, సామ్ కరన్ వచ్చారు. అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రాజస్థాన్ కు గుడ్ బై చెప్పగా.. సంగక్కరాతో భర్తీ చేశారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version