ZIM vs AUS
టీ20 ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగాటోర్నీలో అదరగొడుతున్న చిన్న జట్లలో ఏదో ఒకటి పెద్ద జట్టుకు షాకివ్వడం ఖాయమని అంచనా వేశారు. ఆ అంచనాలను నిజం చేస్తూ జింబాబ్వే , ఆస్ట్రేలియాను (ZIM vs AUS) ఓడించింది. నిజానికి ఒకప్పుడు జింబాబ్వే కూడా మంచి జట్టే కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితుల కారణంగానూ, కొంతమంది ఆటగాళ్లు రిటైరయిపోవడం, వేరే దేశాలకు వెళ్లిపోవడంతో అసోసియేట్ దేశాల స్థాయికి పడిపోయింది.
అయినా సరే అప్పుడప్పుడూ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆసీస్ తో మ్యాచ్ లో జింబాబ్వే ఆటతీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాను(ZIM vs AUS) ఓడించడం అంటే గొప్ప ఘనతగానే చెప్పాలి. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఆల్ రౌండ్ షోతో అదరగొట్టేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. కీలక బౌలర్లు గాయాలతో దూరమవడంతో బలహీనంగా ఉన్న ఆసీస్ బౌలింగ్ ఎటాక్ ను చాలా ఈజీగా ఎదుర్కొని పరుగులు సాధించారు. 8 ఓవర్ల వరకూ జింబాబ్వే వికెట్ కోల్పోలేదంటూ కంగారూల బౌలింగ్ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా బెన్నెట్ ఆసీస్ బౌలింగ్ ను ఆటాడుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 7 ఫోర్లతో 64 పరుగులు చేయగా.. మరుమని (35) పరుగులతో రాణించాడు. తర్వాత ర్యాన్ బర్ట్ (35), సికిందర్ రాజా(25) పరుగులు చేశారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో డ్వార్షియిస్ , నాథన్ ఎల్లిస్ , ఆడమ్ జంపా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 170 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభం నుంచే తడబడింది. ఇంగ్లీస్(8), హెడ్(17) పరుగులకే ఔటవగా.. కామెరూన్ గ్రీన్(0), టిమ్ డేవిడ్ (0) డకౌటయ్యారు.
ఈ దశలో మాక్స్ వెల్, రెన్షా నిలదొక్కుకోవడంతో ఆసీస్ గెలుస్తుందనుకున్నారు. కానీ మాక్స్ వెల్ (35) రన్స్ కు ఔటైన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ మళ్లీ గాడి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. రెన్షా హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా సరే (65) జట్టును గెలిపించలేకపోయాడు. జింబాబ్వే అద్భుతమైన బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ చురుగ్గా కదిలింది. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ 4, ఎవాన్స్ 3 వికెట్లతో ఆసీస్ ను దెబ్బకొట్టారు.
ఈ విజయంతో జింబాబ్వే గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ మూడో స్థానానికి పరిమితమైంది. సూపర్ 8 చేరాలంటే మిగిలిన మ్యాచ్ లలో కంగారూలు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
