Ishan Kishan
టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు భారత్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసింది. నాలుగో టీ ట్వంటీలో ఓడినా సరే అద్భుతంగా పుంజుకున్న టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ, సూర్యకుమార్ , హార్థిక్ పాండ్యా మెరుపులు తోడైతే.. బౌలింగ్ లో అర్షదీప్ పాంచ్ పటాకాతో కివీస్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు.
అయితే అటు న్యూజిలాండ్ ఓడిపోయినా బ్యాటర్లు కూడా భారీ షాట్లతో అలరించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్ కు ముందు బౌలింగ్ సత్తాను కూడా పరీక్షించుకోవాలనుకున్న సూర్యకుమార్ అనుకున్న అంచనాలకు తగ్గట్టే బౌలింగ్ మార్పులు చేసాడు. అయితే భారత్ కు ఈ సారి మంచి ఆరంభం దక్కలేదు.
సంజూ శాంసన్ హోం గ్రౌండ్ లో కూడా ఫెయిలయ్యాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ కూడా వెనుదిరగడంతో కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో ఇషాన్ కిషన్(Ishan Kishan) , సూర్యకుమార్ యాదవ్ జత కలిసారు వీరిద్దరూ చెరొక ఎండ్ నుంచీ రెచ్చిపోయారు.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 42 బంతుల్లోనే శతకం సాధించాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో హార్థిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది.ఇషాన్ కిషన్ దెబ్బకు కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఛేజింగ్ లో న్యూజిలాండ్ కూడా కాస్త దూకుడుగానే ఆడింది. టిమ్ స్టిఫెర్ట్ త్వరగానే ఔటైనా…ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర దుమ్మురేపారు. కేవలం 48 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగించేలా కనిపించింది.
కానీ భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. ఫిన్ అలెెన్ 80 పరుగులకు ఔటవగా.. రచిన్ రవీంద్ర 30 , ఇష్ సోధి 33 పరుగుల చేయగా.. పరుగుల అంతరం తగ్గించేందుకే ఉపయోగపడింది. చివరికి న్యూజిలాండ్ 215 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది.
