Vijay Hazare Trophy
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. పలువురు స్టార్ బ్యాటర్లు మళ్లీ శతకాలతో మోత మోగించారు. అయితే రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఉత్తరాఖండ్ తో మ్యాచ్ లో రోహిత్ డకౌటయ్యాడు. తొలి ఓవర్‌లోనే ఎదొర్కొన్న తొలి బంతికే హిట్ మ్యాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఉత్తరఖాండ్ బౌలర్ దేవంద్ర సింగ్ బోరా ఈ వికెట్ తీశాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్ బరిలో ఉండడంతో 10 వేల మందికి పైగా అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ నిరాశపరిచినా ముంబై మ్యాచ్ గెలిచింది.
మరో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రం తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ బాదిన కోహ్లీ తాజాగా గుజరాత్ పై మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో శతకం సాధిస్తాడని భావించగా.. కోహ్లీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. అయితే గుజరాత్‌పై అర్ధ శతకంతో మరో రికార్డు సాధించాడు. లిస్ట్ – ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు నమోదు చేశాడు. అత్యధిక సగటుతో ఆస్ట్రేలియా మాజీ ఫినిషర్ మైఖేల్ బెవాన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో బెవాన్ సగటు 57.86 గా ఉంచే… కోహ్లీ 57.87తో అతడిని దాటేసాడు. కాగా లిస్ట్ ఏ క్రికెట్ లో ఇటీవలే సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తూ అత్యల్ప మ్యాచుల్లోనే 16 వేల క్లబ్‌లో చేరాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఢిల్లీ 7 పరుగుల తేడాతో విజయం సాధించగా… కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
మరోవైపు యువ క్రికెటర్ రింకూ సింగ్ కూడా కివీస్ తో సిరీస్ కు ముందు ఫామ్ లోకి వచ్చేసాడు.
టీ20 ప్రపంచకప్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తూ ఛండీఘడ్ పై కేవలం 56 బంతుల్లోనే శతకం బాదాడు. .రింకూ సింగ్ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు.తాజాగా ఛండీఘడ్ పై ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా 106 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో యూపీ 227 పరుగుల తేడాతో ఛండీఘడ్ ను చిత్తు చేసింది. ఇక
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)2025-26లో పడిక్కల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం బాదిన పడిక్కల్.. తాజాగా కేరళపైనా దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ లో పడిక్కల్ 124 పరుగులు చేయగా.. కర్ణాటక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్, ముంబై మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ముంబై ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ కోసం ప్రయత్నించి కిందపడడంతో తని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో రఘువంశీని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు.గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
