regatta :  హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ పోటీల జోష్.. యువకెరటం రిజ్వాన్‌కు గోల్డ్ మెడల్

regatta : మూడు రోజులుగా ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో యువ సెయిలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు.

regatta: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ జలాలపై సాగుతున్న ఐదో టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా(open regatta) పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. మూడు రోజులుగా ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో యువ సెయిలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా, మూడో రోజు పోటీల్లో యువ సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan) తన అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకొని సత్తా చాటాడు.

open regatta

ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో రిజ్వాన్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. పోటీల మొదటి రోజు నుంచే నిలకడైన పర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్న రిజ్వాన్, ఈ కేటగిరీలో మరో రేస్ మిగిలి ఉండగానే అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రత్యర్థి సెయిలర్లు అతనికి పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. కొంతకాలంగా సెయిలింగ్‌లో రిజ్వాన్ చూపిస్తున్న నిలకడైన ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

రిజ్వాన్ గోల్డ్‌ మెడల్ సాధించినా కూడా.. రెండో స్థానం కోసం ఉత్కంఠ కొనసాగింది. బొంగూర్ బన్నీ, ఆకాష్ కుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన షేక్ రమీజ్ భాను, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన శ్రింగేరి రాయ్‌పై కేవలం ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచి ఫైనల్ పోరుకు సన్నద్ధమైంది.

ఇక, ఐఎల్ సిఎ 4 కేటగిరీ బాలుర విభాగంలో నేవీ యాచ్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన రమాకాంత్ ఆరు పాయింట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నాడు. బాలికల విభాగంలో ఆస్థా పాండే అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటింది. 420 మిక్స్‌డ్ కేటగిరీలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన తనూజా కామేశ్వర్, శ్రవణ్ కత్రావత్ 10 పాయింట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. 29ఈఆర్ బాలుర విభాగంలో అజయ్, సత్యం ఝా మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ బాలుర విభాగంలో తెలంగాణ సెయిలింగ్ క్లబ్ నుంచి ఆర్డిన్ ఆంటోనీ టాప్‌లో ఉండగా, బాలికల విభాగంలో శ్రిష్టి బరార్, శిరీష సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ యూత్ ఓపెన్ రెగెట్టా ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం అంటే జులై 30న ముగియనున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. హుస్సేన్ సాగర్ జలాలపై యువ సెయిలర్లు సృష్టించిన ఈ ఉత్సాహభరితమైన వాతావరణం, రాబోయే తరానికి సెయిలింగ్ క్రీడ పట్ల ఆసక్తిని పెంచుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version