Sanju Samson : సంజూ చేజేతులా..!వైఫల్యాల బాటలో ఓపెనర్

Sanju Samson : టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా సంజూ శాంసన్ పై నమ్మకముంచిన గంభీర్ అతనికి అవకాశమిచ్చాడు

Sanju Samson

భారత క్రికెట్ జట్టులో అవకాశాలు అందరికీ రావు.. వచ్చిన అవకాశాన్ని అప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.. ఎందుకంటే టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం.. స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉండాలి. ఒకవేళ ఒకటిరెండు మ్యాచ్ లలో ఫెయిలైతే మాత్రం తుది జట్టులో చోటు గల్లంతవుతుంది. నెలల తరబడి వైఫల్యాల బాట వీడకుంటే కెరీరే ప్రమాదంలో పడుతుంది.

ప్రస్తుతం భారత యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్(Sanju Samson) మొదటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తుది జట్టులో తన ప్లేస్ ను తానే ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా సంజూ శాంసన్(Sanju Samson) పై నమ్మకముంచిన గంభీర్ అతనికి అవకాశమిచ్చాడు. దీని కోసం పేలవ ఫామ్ లో ఉన్న వన్డే కెప్టెన్ గిల్ ను సైతం పక్కన పెట్టేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ దుమ్మురేపుతాడనుకున్న సంజూ వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్నాడు.

ఇప్పటి వరకూ జరిగిన మూడు టీ ట్వంటీల్లోనూ విఫలమయ్యాడు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 10 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత రాయ్ పూర్ టీ ట్వంటీలో 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు సందర్భాల్లోనూ చెత్త షాట్లతోనే వికెట్ పారేసుకున్నాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా మూడో టీ ట్వంటీలో అసలు ఖాతానే తెరవలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌటై నిరాశపరిచాడు. దీంతో సంజూ శాంసన్(Sanju Samson) పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మద్ధతుగా నిలిచిన ఫ్యాన్సే ఇప్పుడు తిట్టిపోస్తున్నారు. ఇచ్చిన అవకాశాలను వరుసగా వృథా చేసుకుంటున్నాడంటూ ఫైర్ అవుతున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కివీస్ తో జరిగిన మూడు టీ ట్వంటీలూ బ్యాటింగ్ పిచ్ లే. అటువంటి పిచ్ లపై అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ వంటి వాళ్లు చెలరేగిపోతుంటే ఎంతో టాలెంట్ ఉండి కూడా సంజూ ఇలా ఫెయిలవుతుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గతంలో చాలాసార్లు సంజూకు అన్యాయం జరుగుతోంది.. సెలక్టర్లు అన్యాయం చేస్తున్నారు.. అతని కెరీర్ ను నాశనం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిన అభిమానులు, మాజీలు ఇప్పుడు సంజూ వైఫల్యాల బాటను వీడకపోవడంపై షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే ప్రపంచకప్ కు ముందు కివీస్ తో సిరీసే చివరిది. మిగిలిన రెండు మ్యాచ్ లోనైనా రాణించకుంటే అసలు తుది జట్టులో చోటు గల్లంతయిపోతుంది.

Sanju Samson

మెగాటోర్నీలో టీమ్ కాంబినేషన్ విషయంలో రాజీ పడే పరిస్థితులు లేవని హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే చెప్పేశాడు. దీంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారిని నిరాశపరచకుండా ఎవరైతే ఫెయిలవుతున్నారో వారిని తప్పించేయడం ఖాయం. ప్రస్తుతం కివీస్ పై సిరీస్ గెలుచుకోవడంతో మిగిలిన రెండు మ్యాచ్ లలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, రిజర్వ్ ప్లేయర్స్ కు అవకాశాలు దక్కనున్నాయి. ఈ క్రమంలో సంజూ శాంసన్ కు ఈ రెండు మ్యాచ్ లే చివరి అవకాశాలుగా భావిస్తున్నారు.

ఎందుకంటే తిలక్ వర్మ కోలుకుంటున్నప్పటకీ కివీస్ తో సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. నేరుగా ప్రపంచకప్ లో ఆడేందుకు తిలక్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ ను తప్పించాల్సిందే. మరి ఫామ్ లో ఉన్న ఇషాన్ ను తప్పించి ఓపెనర్ గా సంజూను కొనసాగించే అవకాశాలు తక్కువే. అటు ఇషాన్ కూడా ఓపెనర్ గా దుమ్మురేపుతాడు. దీంతో సంజూ శాంసన్ ప్లేస్ కు ఇషాన్ కిషన్ ఎర్త్ పెట్టబోతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రపంచకప్ లోనూ ఓపెనర్ గా కొనసాగాలంటే మాత్రం సంజూ న్యూజిలాండ్ పై చివరి రెండు టీ20ల్లోనూ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాల్సిందే. లేకుంటే తుది జట్టులో ప్లేస్ గల్లంతయినట్టేనని మాజీలు తేల్చేస్తున్నారు.

Women:మహిళలకు బంపర్ ఆఫర్.. ఉచిత ల్యాప్‌టాప్‌, ఇంటి నుంచే ఆదాయం

Exit mobile version