Sushil Kumar
ఒలింపిక్ పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్‌కు సంబంధించిన ఒక సంచలనాత్మక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్‌కర్ హత్య కేసు(Sagar Dhankar murder case)లో సుశీల్ కుమార్‌కు గతంలో మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో సుశీల్ కుమార్ ఒక వారం రోజుల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణ, తీర్పు భారత క్రీడా ప్రపంచంలో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది.
2021లో జరిగిన ఈ హత్య కేసులో సుశీల్ కుమార్(Sushil Kumar)తో పాటు మరో 17 మందిపై దోపిడీ, హత్య, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో సుశీల్ కుమార్‌ది కీలక పాత్ర అని పోలీసులు ఆరోపించారు. మూడేళ్లు జైలులో గడిపిన సుశీల్ కుమార్(Sushil Kumar)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సాగర్ ధన్‌కర్ తండ్రి అశోక్ ధన్‌కర్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుశీల్ కుమార్ జైలులో ఉన్నప్పుడు సాక్షులను బెదిరించారని, తప్పుడు వాదనలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు, బెయిల్‌ను రద్దు చేసి, నిందితుడు లొంగిపోవాలని ఆదేశించింది.
భారతదేశంలో ఆటగాళ్లు నేర కేసుల్లో ఇరుక్కోవడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా డోపింగ్ లేదా క్రీడా సంఘాలలో అవినీతి వంటి ఆరోపణలు మాత్రమే వినిపిస్తాయి. కానీ సుశీల్ కుమార్ కేసు ప్రత్యక్ష హత్య, క్రిమినల్ కుట్ర వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించినది. ఒక ఒలింపిక్ పతక విజేతపై ఇలాంటి ఆరోపణలు రావడం దేశ చరిత్రలోనే దాదాపు జరగలేదని చెప్పవచ్చు. ఈ కేసు సుశీల్ కుమార్ క్రీడా కీర్తికి, ప్రతిష్టకు తీవ్రమైన దెబ్బగా మారింది.
గతంలో క్రీడాకారులపై వచ్చిన కేసుల గురించి ఇలాంటి ఉదాహరణలు అంతగా లేకపోయినా, గతంలో కొంతమంది ప్రముఖ క్రీడాకారులపై కొన్ని కేసులు నమోదయ్యాయి.
అథ్లెట్ లలిత్ బూడీ హత్య కేసులో ఇరుక్కున్నాడు. తన తోటి ఆటగాడి హత్యకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి.అలాగే బాక్సర్ వినోద్ కుమార్ జాతీయ స్థాయి బాక్సర్ అయిన వినోద్ ..ఒక బార్‌లో జరిగిన గొడవలో ఒక వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశారని కేసు నమోదైంది.
బ్రెజిలియన్ ఫుట్‌బాలర్ బ్రూనో ని ఇదొక అంతర్జాతీయ ఉదాహరణగా చెప్పొచ్చు. తన గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసి, శవాన్ని మాయం చేశాడనే కేసులో అరెస్ట్ అయ్యాడు.
సుశీల్ కుమార్(Sushil Kumar) కేసు క్రీడా ప్రపంచంలో ఒక కొత్త చర్చకు దారితీసింది. క్రీడా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి, ఇలాంటి తీవ్రమైన నేర ఆరోపణలను ఎదుర్కోవడం సమాజంపై, క్రీడలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ తీర్పు తర్వాత సుశీల్ కుమార్ రాజకీయ, సామాజిక జీవితం ఎలా మారుతుందో చూడాలి.