Team India
సొంతగడ్డపై టీమిండియా(Team India) హవా మళ్ళీ మొదలైంది. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం తర్వాత టెస్ట్ క్రికెట్ లో విమర్శలు ఎదుర్కొంది. పైగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకోవడం, కోహ్లీ-రోహిత్ వీడ్కోలు పలకడం ఇలా వరుసగా అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో సిరీస్ ను సమం చేసిన భారత్ ఇప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్ ను చిత్తు చేసింది. కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత శుభమన్ గిల్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు.
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్(Team India) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. నిజానికి ఈ మ్యాచ్ మూడోరోజుల్లోనే ముగుస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ కేవలం 248 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కానీ ఫాలో ఆన్ లో కరేబియన్లు అద్భుత పోరాటం చేశారు.
క్యాంప్ బెల్, షై హోప్ సెంచరీలతో విండీస్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించారు. చివర్లో గ్రీవ్స్ , సీల్స్ కూడా పోరాడడంతో వెస్టిండీస్ 121 పరుగుల టార్గెట్ ను ఉంచగలిగింది. ఓటమి తప్పదని తేలిపోయినా విండీస్ అసాధారణ పోరాటం మాత్రం ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 518 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 175 , శుభమన్ గిల్ 129 నాటౌట్ తో పాటు సాయిసుదర్శన్ 87 , నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులతో రాణించారు.
తర్వాత కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి విండీస్ 248 రన్స్ కే కుప్పకూలింది. ఫాలో ఆన్ లో మాత్రం అద్భుతంగా ఆడి 390 పరుగులు చేసింది. విండీస్ పోరాటం కారణంగానే ఈ మ్యాచ్ ఐదోరోజు మార్నింగ్ సెషన్ వరకూ వచ్చింది. చివరి రోజు కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించగా భారత్ 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్(Team India) గెలిచింది. గిల్ కెప్టెన్సీలో ఇదే తొలి సిరీస్ విజయం. అంతేకాదు అత్యధిక సిరీస్ విజయాల రికార్డుల్లో టీమిండియా ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్ లో అదరగొట్టిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
సిరీస్ ఆద్యంతం ఆల్ రౌండ్ షోతో సత్తా చాటిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది. కాగా తాజా సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. విన్నింగ్ పర్సంటేజీని 61.90కు పెంచుకుంది. ఇప్పటి వరకూ ఆడిన 7 మ్యాచ్ లలో నాలుగు గెలిచి , రెండింటిలో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా , శ్రీలంక తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.