ODI
దాదాపు మూడు వారాల విరామం తర్వాత టీమిండియా క్రికెట్ సీజన్ మొదలైంది.న్యూజిలాండ్ తో కొత్త ఏడాదిలో తన బిజీ క్రికెట్ షెడ్యూల్ ను మొదలుపెట్టబోతోంది. మొదట మూడు వన్డేల సిరీస్(ODI) , తర్వాత ఐదు టీ ట్వంటీ మ్యాచ్ ల సిరీస్ ఆడబోతోంది.
వన్డే సిరీస్(ODI) లో భాగంగా తొలి మ్యాచ్ కు వడోదర ఆతిథ్యమిస్తుండగా.. భారత తుది జట్టు కూర్పు సవాల్ గా మారింది. నిజానికి గత కొంతకాలంగా జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతుండడంతో 15 మంది ఎంపిక ఒక ఛాలెంజ్ గా ఉంటే..
తుది జట్టు కూర్పు మరో తలనొప్పిగా ఉంటోంది. న్యూజిలాండ్ తో వడోదర వేదికగా జరగబోయే తొలి వన్డేలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. 9 స్థానాల వరకూ పెద్దగా ఇబ్బంది లేకున్నా మిగిలిన రెండు స్థానాలపైనే సస్పెన్స్ నెలకొంది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్ కు గిల్ లేకపోవడంతో అప్పుడు జైస్వాల్ కు చోటు దక్కింది. ఇప్పుడు గిల్ రాకతో జైస్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. వన్ డౌన్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దిగనుండగా..
చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ నాలుగో ప్లేస్ లో ఆడడం ఖాయం. అయితే ఐదో ప్లేస్ లో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీశ్ కు వాషింగ్టన్ సుందర్ నుంచే పోటీ నెలకొంది. పిచ్ పరిస్థితిని బట్టి పేస్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే నితీశ్ , స్పిన్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే సుందర్ ను తీసుకుంటారని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. అంతేకాదు రాహుల్ కే కీపింగ్ బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గానూ, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్ గానూ బరిలోకి దిగడం ఖాయం.
అటు బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ తో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ కు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శనలతో మళ్లీ ఫామ్ అందుకున్న ఈ హైదరాబాదీ పేసర్ మూడు వన్డేల సిరీస్ లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉండాలంటే సిరాజ్ కు ఈ సిరీస్ నుంచే అగ్నిపరీక్ష మొదలైనట్టేనని భావిస్తున్నారు.
