World Cup
ఇటు సొంతగడ్డపై టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్ ను వరుస మ్యాచ్ లలో చిత్తు చేస్తుంటే.. అటు భారత కుర్రాళ్ల జట్టు కూడా కివీస్ ను నిలువరించింది. అండర్ 19 ప్రపంచ కప్(World Cup) జైత్రయాత్రను కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో కివీస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది.
భారత బౌలర్ల దెబ్బకు 36.2 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. కివీస్ జట్టులోని ప్రధాన బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. భారత సంతతికి చెందిన పలువురు ఆటగాళ్లే ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న కివీస్ ను శాంసన్(37), సంజయ్ (28), కాట్టర్ (23) పరుగులతో ఆదుకున్నారు. భారత బౌలర్లలో అంబరీష్, హెనిల్ పటేల్ న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అంబరీష్ 4 వికెట్లు తీయగా…పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఛేజింగ్ లో భారత్ దుమ్మురేపింది. ఆరోన్ జార్జ్ (7) త్వరగానే ఔటైనా..
యువ సంచలనం వైభవ్ సూర్వంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆయుశ్ మాత్రే, సూర్యవంశీ రెండో వికెట్ కు 76 పరుగులు జోడించారు.
కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా భారత్ అండర్ 19 జట్టు కేవలం 13.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో గ్రూప్ స్టేజ్ లో ఒక్క ఓటమి లేకుండా సూపర్ సిక్స్ లో అడుగుపెట్టింది. కాగా గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్ లో అమెరికా పైనా, రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పైనా ఘనవిజయాన్ని అందుకున్న భారత యువ జట్టు జనవరి 27న జింబాబ్వే, ఫిబ్రవరి 1న పాకిస్థాన్ తో తలపడనుంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే సూపర్ ఫామ్ తో పాటు బౌలర్లు నిలకడగా రాణిస్తుండడంతో భారత్ కుర్రాళ్లు అండర్ 19 ప్రపంచకప్(World Cup) టైటిల్ ఫేవరెట్స్ లో దూసుకెళుతోంది..
T20 World cup : బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్.. ఐసీసీ కీలక నిర్ణయం
