Hyderabad
హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్‌గానో, పర్యాటక కేంద్రంగానో మాత్రమే కాదు, దురదృష్టవశాత్తూ అగ్నిప్రమాదాల అడ్డాగా కూడా మారుతోంది. శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని చిరాగ్ అలీ లేన్‌లో ఉన్న బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ మరోసారి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు బాధ్యులనే ప్రశ్నలు ఇప్పుడు నగరవాసులను వేధిస్తున్నాయి.
హైదరాబాద్(Hyderabad) అగ్ని చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. మనకు కనిపిస్తున్న గణాంకాలు భయంకరంగా ఉన్నాయి. 2024లో 801 ప్రమాదాలు జరిగితే, 2025కి ఆ సంఖ్య 835కు చేరింది. అంటే అగ్నిప్రమాదాల రేటు ఏటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. గత ఏడాది అగ్ని ప్రమాదాల వల్ల 51 మంది ప్రాణాలు కోల్పోగా, 32 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మొత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 2025లో 8,861 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 163 మంది మరణించారు. దాదాపు 879 కోట్ల రూపాయల ఆస్తి మంటల్లో బూడిదైపోయింది.
| సంవత్సరం | ప్రమాదాలు | మరణాలు | నష్టం (కోట్లు) |
|---|---|---|---|
| 2023 | 767 | 1 | 1.96 |
| 2024 | 801 | 1 | 22.27 |
| 2025 | 835 | 51 | 32.38 |
ఇన్ని మరణాలు, ఇంత నష్టం జరుగుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతీసారి ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం, విచారణ కమిటీలు వేయడం, కొన్ని భవనాలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం అధికారులు ఒక అలవాటుగా మారిపోయింది. నాంపల్లి ఘటనలో పోలీసులు, అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి ట్రాఫిక్ దారి మళ్లించడం, పక్క భవనాలను ఖాళీ చేయించడం వంటి చర్యలు తీసుకున్నాయి.
అయితే, అసలు ప్రమాదమే జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్నే ఇప్పుడు అందరిలో తలెత్తుతుంది. నిబంధనల ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ హైదరాబాద్‌లోని వేలాది కమర్షియల్ భవనాలకు ఈ సర్టిఫికెట్ లేదన్నది బహిరంగ రహస్యం.
జీహెచ్‌ఎంసీ అధికారులు కేవలం మొదటి లేదా రెండు అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు, కానీ భవన యజమానులు అక్రమంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల్లో అగ్నిప్రమాదం జరిగితే బయటకు రావడానికి కనీస దారి కూడా ఉండదు. కమర్షియల్ అవసరాల కోసం నిర్మించిన భవనాల్లోనే కొందరు నివాసాలు ఉండటం వల్ల ప్రాణనష్టం తీవ్రత పెరుగుతోంది.
2025 మేలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో జరిగిన ప్రమాదమే దీనికి పెద్ద నిదర్శనం. ఒక పెర్ల్ షాపులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎనిమిది మంది చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో వ్యాపారం, పై అంతస్తుల్లో జనం నివసించడం వల్ల పొగ పైకి వ్యాపించి ఊపిరాడక వారు మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతవుతున్నా అధికారులు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదో అర్థం కావడం లేదు.
హైదరాబాద్(Hyderabad)లో ముఖ్యంగా పాతబస్తీ, కోఠి, నాంపల్లి, సికింద్రాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో గల్లీలు చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంటాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి కూడా దారి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఫర్నిచర్ దుకాణాలు, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ స్టోర్లు వంటి చోట్ల మంటలను త్వరగా వ్యాప్తి చేసే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా అది భారీ అగ్నిప్రమాదానికి దారితీస్తుంది.
ఉప్పల్‌లో జరిగిన ఫర్నిచర్ షాపు ప్రమాదం కానీ, షాహాలీబాండాలో ఫ్రిజ్ పేలి ఇద్దరు మరణించిన ఘటన చూసినా, భవనాల్లో వెంటిలేషన్ లేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలుస్తోంది. అధికారులు నోటీసులు ఇస్తున్నామని చెబుతున్నా, ఆ నోటీసులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. కోర్టు స్టేలు ఉన్నాయని కొన్ని భవనాలను ముట్టుకోవడం లేదు, మరికొన్ని చోట్ల అవినీతి వల్ల చర్యలు ఆగిపోతున్నాయి.
ప్రభుత్వ విభాగాలు ఒకదానిపై ఒకటి నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న జనాభా, పెరిగిపోతున్న కమర్షియల్ ఏరియాలను దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఫైర్ రోబోలు, ఆధునిక యంత్రాలు వచ్చినా, వాటిని వాడటానికి సరిపడా సిబ్బంది లేకపోవడం మరో లోపం.
ఇప్పటికైనా ప్రభుత్వం..ప్రతి అగ్నిప్రమాదాన్ని కేవలం ఒక ‘యాక్సిడెంట్’ గా చూడకుండా, అది అధికారుల వైఫల్యంగా గుర్తించాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలను సీజ్ చేయాలి. బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ ఆడిట్లను తప్పనిసరి చేయాలి.
ముఖ్యంగా ఇరుకైన గల్లీలలో ఉన్న ఫర్నిచర్, బట్టల గోడౌన్లను సిటీ బయట కు తరలించే ప్రయత్నం చేయాలి. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యుల జీవితాలు నిప్పుల్లో కాలిపోకూడదు. అమాయక చిన్నారులు, వృద్ధులు అగ్నికి ఆహుతి కాకూడదు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమే.. కానీ కఠినమైన చట్టాలు, వాటి అమలు అధికారుల బాధ్యత. అది మర్చిపోయిన రోజు భాగ్యనగరం మరిన్ని విషాదాలకు కేరాఫ్ అవుతుంది.
Generation:మాయమైపోతున్న మహోన్నత తరం.. మనం ఏం కోల్పోతున్నామో తెలుసా?
