Vijay
స్టార్ ప్లేయర్స్ ఎంట్రీతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన విజయ్(Vijay) హజారే ట్రోఫీలో మొదటిరోజే కుర్రాళ్లు, సీనియర్లు దంచేశారు. అంచనాలు పెట్టుకున్న వారంతా అదరగొట్టేశారు. తొలిరోజు రికార్డుల మోతలో బిహార్, అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ గురించే ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో చాలా రికార్డుల బద్దలయ్యాయి.
బిహార్ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం,14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రికార్డు స్ట్రైక్ రేటుతో డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో శతకం బాదిన, 150 ప్లస్ స్కోరు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
అయితే వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన రికార్డును అరగంటలోనే అతని సహచర బ్యాటర్ సకీబుల్ గని బ్రేక్ చేశాడు. గని కేవలం 32 బంతుల్లోనే శతకం బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్లో భారత్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశీ రికార్డునే కాదు 2024లో పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ చేసిన 35 బంతుల్లో సెంచరీని కూడా గని దాటేశాడు. గని కేవలం 40 బంతుల్లోనే 128 రన్స్ చేశాడు. 26 ఏళ్ల సాకిబుల్ గని బిహార్ జట్టులో బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు.
కాగా వైభవ్, గని వికెట్ కీపర్ లోహరుకా సెంచరీతో బిహార్ 50 ఓవర్లలో ఏకంగా 574/6 పరుగులు చేసింది. ప్రొఫెషనల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇంతకుముందు తమిళనాడు 506 పరుగులు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును బిహార్ అధిగమించింది. మరోవైపు జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
ఇటీవల సయా ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వరద పారించి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఇషాన్ కిషన్ తాజాగా విజయ్(Vijay) హజారేలోనూ దుమ్ములేపాడు. కర్ణాటకపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఇషాన్ విధ్వంసంతో భారీస్కోరు చేసినా జార్ఖండ్ దానిని కాపాడుకోలేకపోయింది.
కర్ణాటక బ్యాటర్ దేవడల్ పడిక్కల్ వీరోచిత పోరాటంతో రికార్డు స్కోరును ఛేజ్ చేసింది.413 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 14-రన్స్ చేసాడు. అలాగే విజయ్ హజారే టోర్నీ చరిత్రలో రికార్డు ఛేజింగ్ నమోదైంది. అలాగే విజయ్(Vijay) హజారేలో తొలిరోజు ఒక అనామక ఆటగాడు కూడా చరిత్ర సృష్టించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో రికార్డులకెక్కాడు. ఒడిశా క్రికెటర్ స్వస్తిక్ సమల్ సౌరాష్ట్రపై అదరగొట్టేశాడు. 169 బంతుల్లో 212 పరుగులు చేశాడు. దీని ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఒడిశా క్రికెటర్ గా ఘనత సాధించాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగానూ నిలిచాడు.
