Ranji Trophy: టీమిండియాలోకి దారేది ? రంజీల్లో అదరగొడుతున్నా నో ప్లేస్

Ranji Trophy: హర్షిత్ రాణాకు ఎన్ని అవకాశాలిచ్చారో కదా అంటూ గుర్తు చేస్తున్నారు. కేవలం గంభీర్ అండతోనే హర్షిత్ రాణా వరుస సిరీస్ లకు ఎంపికవుతున్నాడన్నది ఎవరు ఒప్పుకోకున్నా నిజం.

Ranji Trophy

జాతీయ జట్టులోకి ఎంపికవ్వాలంటే దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే ప్రామాణికం.. రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో రాణిస్తే చాలు సెలక్టర్లు జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. అది సీనియర్లయినా, జూనియర్లయినా ఇదే విధానం ఫాలో అవుతుంటారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత టీ20లకు మాత్రం దేశవాళీ క్రికెట్ కంటే ఆ లీగ్ లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ టెస్టులకు మాత్రం రంజీల్లో ప్రదర్శనే కీలకం. సెలక్టర్లు కూడా చాలా సార్లు ఎవ్వరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే పరిగణలోకి తీసుకుంటామని చాలా సార్లు చెబుతూనే ఉన్నారు. కానీ ఇది మాటలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టు ఎంపికే దీనికి ఉదాహరణ. దాదావు వెస్టిండీస్ సిరీస్ లో ఆడిన జట్టునే కొనసాగించారు. అదే సమయంలో రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో ఆడుతున్న పలువురు ఆటగాళ్ళను పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

వారిలో కరుణ్ నాయర్, మహ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్.. ఇంకా పలువురు యువ ఆటగాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఇంగ్లాండ్ టూర్ లో వచ్చిన అవకాశాలను కరుణ్ నాయర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సిరీస్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. అయితే మళ్ళీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో దుమ్మురేపాడు. సెంచరీ, డబుల్ సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. తాను మరికొన్ని సిరీస్ లు ఆడేందుకు అర్హుడినంటూ వ్యాఖ్యానించాడు. అయినప్పటకీ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ అతన్ని పట్టించుకోలేదు. అటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీది కూడా ఇదే పరిస్థితి. గుజరాత్ పై 8 వికెట్లతో సత్తా చాటినా షమీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విమర్శలు వస్తున్నాయి.

Ranji Trophy

అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దేశవాళీ క్రికెట్ ఆడి నిరూపించుకుంటేనే పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్న సెలక్టర్లు అసలు వారిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ ఒక్కటే సరిపోదని, బీసీసీఐలో పెద్దల అండ ఉంటేనే జట్టులో చోటు దక్కుతుందంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనికి పలువురి పేర్లను ఉదాహరణగా చెబుతున్నారు.

హర్షిత్ రాణాకు ఎన్ని అవకాశాలిచ్చారో కదా అంటూ గుర్తు చేస్తున్నారు. కేవలం గంభీర్ అండతోనే హర్షిత్ రాణా వరుస సిరీస్ లకు ఎంపికవుతున్నాడన్నది ఎవరు ఒప్పుకోకున్నా నిజం. దీనికి గంభీర్ ఎంత సమర్థించుకున్నా, ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగిన అదే వాస్తవం. అలాంటిది దేశవాళీ క్రికెట్ లో చెలరేగుతున్న వారిని స్వదేశీ సిరీస్ లకు కూడా ఎంపిక చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే సెలక్షన్ కమిటీ నిర్ణయాలను ప్రశ్నించినందుకే షమీని పట్టించుకోవడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆసీస్ టూర్ కు ముందు షమీ ఫిట్ నెస్ గురించి అప్ డేట్ లేదని అగార్కర్ చెప్పడం, దానికి వెటరన్ పేసర్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఫిట్ గా లేకుంటే రంజీల్లో ఎలా ఆడతానంటూ షమీ కాస్త ధాటుగానే రియాక్ట్ కావడంతో అగార్కర్ కు కోపం తెప్పించిందేమోనన్న డౌట్స్ కూడా వచ్చాయి. ఏదైతేనేం రంజీ ట్రోఫీ ప్రదర్శనలను కూడా పట్టించుకోకుండా సెలక్టర్లు జట్టును ఎలా ఎంపిక చేస్తున్నారో అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version