Women’s World Cup 2025
మహిళల వన్డే ప్రపంచకప్(Women’s World Cup 2025) లో భారత్ సెమీఫైనల్ కు దూసుకొచ్చింది. డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి నాకౌట్ కు క్వాలిఫై అయింది. స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీతో చెలరేగిన వేళ కివీస్ ను ఎలిమినేట్ చేసి చివరి సెమీస్ బెర్తును దక్కించుకుంది. ఇప్పుడు సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టాప్ 4 లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, భారత్ ఇంకా చివరి మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా.. సఫారీలు రెండో స్థానంలోనూ, ఇంగ్లాండ్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
వరల్డ్ కప్(Women’s World Cup 2025) రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు, నాలుగో ప్లేస్ లో ఉన్న టీమ్ తో తొలి సెమీస్ ఆడుతుంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లోనూ , భారత్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఇరు జట్లూ ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాలి. భారత్ తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచినా 8 పాయింట్లకు చేరుతుంది. టాప్-3లో ఉన్న మిగిలిన జట్లను భారత్ దాటలేదు.
ఈ నేపథ్యంలో భారత్ ప్లేస్ నాలుగో స్థానంలోనే ఖాయమైంది. అయితే సౌతాఫ్రికాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో గెలిస్తే ఆస్ట్రేలియా 13 పాయింట్లతో టాప్ ప్లేస్ ను దక్కంచుకుంది. అప్పుడు సెమీస్ లో భారత్ ప్రత్యర్థి ఆసీసే కానుంది. ఒకవేళ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా గెలిస్తే 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటుంది. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ తొలి సెమీస్ లో తలపడతాయి. దీని ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ తర్వాత టీమిండియా ప్రత్యర్థి డిసైడ్ అవుతుంది.
లీగ్ స్టేజ్ లో ఈ రెండు జట్ల చేతిలోనూ భారత్ పరాజయం పాలైంది. నిజానికి ఈ రెండు మ్యాచ్ లూ గెలిచేవే. కానీ డెత్ ఓవర్లలో పేలవ బౌలింగ్ కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ ఆసీస్ ఫైనల్ కు వస్తే మాత్రం భారత జట్టు అంచనాలకు మించి రాణించాలి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
పైగా ఆల్ రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలంగా చెప్పాలి. మరోవైపు చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్ సెమీస్ కు ముందు ఘనవిజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటి వరకూ పెద్దగా రాణించని బ్యాటర్లు ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ గొప్ప అవకాశంగా చెప్పాలి.
