Marine Cloud Brightening
ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు, విధానకర్తలు కేవలం కర్బన ఉద్గారాలను (Carbon Emissions) తగ్గించడంపై మాత్రమే కాకుండా, భూమిపై పడే సూర్యకాంతి మొత్తాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ వివాదాస్పదమైన, కానీ విప్లవాత్మకమైన ప్రక్రియనే జియో ఇంజనీరింగ్ (Geoengineering) లేదా క్లైమేట్ ఇంటర్వెన్షన్ (Climate Intervention) అంటారు. ఇది భూమి యొక్క వాతావరణాన్ని పెద్ద ఎత్తున మార్చడానికి ఉద్దేశించిన ఒక ప్రణాళిక.
జియో ఇంజనీరింగ్‌లో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి. అవి కార్బన్ తొలగింపు , సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్ (SRM).
సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్ (SRM)..
SRM యొక్క లక్ష్యం చాలా ఈజీ.. సూర్యుడి నుండి వచ్చే వేడిని భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించకుండా, దానిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించేలా చేయడం. దీనికి రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి.
1. స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ (SAI).. భూమి ఉపరితలం నుండి 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్లోకి విమానాలు లేదా బెలూన్ల ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ (Sulfur Dioxide) లేదా కాల్షియం కార్బోనేట్ వంటి అణువులను (Aerosols) విడుదల చేస్తారు.
ఈ అణువులు సూర్యకాంతిని అద్దంలా ప్రతిబింబిస్తాయి. 1991లో ఫిలిప్పీన్స్‌లో మౌంట్ పినాటుబో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు సహజంగా ఇలాంటిదే జరిగింది, ఆ విస్ఫోటనం తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రతలు సుమారు రెండు సంవత్సరాల వరకు తాత్కాలికంగా తగ్గాయి.
అయితే దీనివల్ల ఓజోన్ పొరకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. అలాగే, ఈ అణువులను క్రమం తప్పకుండా విడుదల చేయకపోతే, ఉష్ణోగ్రత ఒకేసారి పెరిగి, తీవ్రమైన వాతావరణ షాక్‌కు దారితీయెచ్చు.
2. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ (MCB): మేఘాలకు రంగులు వేయడం(Marine Cloud Brightening)..
సముద్ర ఉపరితలంపై ఉన్న తక్కువ ఎత్తులోని మేఘాలలోకి ఉప్పు కణాలు లేదా నీటి ఆవిరిని పంపుతారు. ఈ ఉప్పు కణాలు మేఘాలలో నీటి బిందువుల సంఖ్యను పెంచుతాయి, తద్వారా మేఘాలు మరింత తెల్లగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
మేఘాలు తెల్లబడటం వల్ల సూర్యకాంతిని అంతరిక్షంలోకి మరింత ఎక్కువగా ప్రతిబింబిస్తాయి,దీని ద్వారా సముద్ర ఉపరితలం చల్లబడుతుంది.
అయితే దీనివల్ల మేఘాల యొక్క సహజ చక్రం (Precipitation Cycle) దెబ్బతినవచ్చు, కొన్ని ప్రాంతాలలో వర్షపాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది.
జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో పరిష్కారాన్ని చూపినా, దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ట్రీట్మెంట్ వర్సెస్ క్యూర్.. కర్బన ఉద్గారాలను తగ్గించకుండా, కేవలం లక్షణాలను (వేడిని) మాత్రమే తగ్గించడం అనేది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు.
అంతర్జాతీయ సహకారం.. ఒక దేశం తన సొంత వాతావరణ సమస్యను పరిష్కరించడానికి జియో ఇంజనీరింగ్ చేస్తే, అది పొరుగు దేశాల వాతావరణంపై (వర్షపాతం, తుఫానుల తీవ్రత) తీవ్ర ప్రభావం చూపొచ్చు. ఇది అంతర్జాతీయ రాజకీయ ఘర్షణలకు దారితీయొచ్చు.
అంతేకాదు ఈ సాంకేతికతకు అయ్యే ఖర్చుతో పాటు ఏదైనా వైఫల్యం జరిగితే కలిగే అనూహ్య నష్టం చాలా పెద్దదిగా ఉంటుంది.
జియో ఇంజనీరింగ్ అనేది గ్లోబల్ వార్మింగ్‌కు తాత్కాలిక ఉపశమనం అందించగల శక్తివంతమైన సాధనం. అయితే, దీనిని విస్తృతంగా అమలు చేసే ముందు, దశాబ్దాల పాటు విస్తృతమైన శాస్త్రీయ అధ్యయనాలు, నైతిక చర్చలు , ప్రపంచవ్యాప్త ఒప్పందాలు అవసరం. భూమిని చల్లబరచడానికి మేఘాలకు రంగులు వేయాలనే ఆలోచన సైన్స్ ఫిక్షన్ నుంచి నిజానాకి చేరే మార్గంలో ఉన్నా కూడా , దానితో వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ .
