Hyderabad
హైదరాబాద్(Hyderabad) లాంటి అభివృద్ధి చెందిన మహానగరంలో.. అత్యవసర సమయాల్లో పబ్లిక్ టాయిలెట్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలో దాదాపు 1.2 కోట్ల జనాభాకు కేవలం 1,385 పనిచేసే టాయిలెట్లు మాత్రమే అందుబాటులో ఉండడం, ప్రతి 10 వేల మందికి ఒక టాయిలెట్ మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2018లో జీహెచ్‌ఎంసీ 7,500 టాయిలెట్లను నిర్వహించేది. కానీ ఇప్పుడు వాటిలో దాదాపు 80% నిరుపయోగంగా మారాయి. తలుపులు విరిగిపోవడం, చెత్త పేరుకుపోవడం, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి సమస్యలతో చాలా టాయిలెట్లు పనికిరాకుండా పోయాయి. ఈ పరిస్థితి ఇలా ఉన్నా, హైదరాబాద్(Hyderabad)ను ఇప్పటికే బహిరంగ మల విసర్జన రహిత నగరం (ODF) గా ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని సులభ్ కాంప్లెక్సులు మాత్రం కొంతవరకు మెరుగైన నిర్వహణతో ఉన్నాయి. ఈ పరిస్థితులను మెరుగుపరచడానికి 2025 జూన్‌లో జీహెచ్‌ఎంసీ మరోసారి 1370 టాయిలెట్లను పునరుద్ధరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో ప్రపంచంలోనే ఉత్తమ దేశాలుగా నార్వే, టర్కీ, జపాన్ వంటివి నిలుస్తున్నాయి. ఈ దేశాల్లో పబ్లిక్ టాయిలెట్లను ప్రజల గౌరవంగా భావిస్తారు. అక్కడి ప్రజలు వాటిని తమ సొంత ఆస్తిలా భావిస్తారు. స్వీడన్‌లో స్టాక్‌హోమ్ వంటి నగరాల్లో సెల్ఫ్-క్లీనింగ్ టాయిలెట్లు ఉంటాయి. ఒకరు ఉపయోగించిన తర్వాత అవి వాటంతట అవే శుభ్రం చేసుకుని, డిస్‌ఇన్ఫెక్ట్ అవుతాయి.
టర్కీలో మన దేశంలో మాదిరిగానే స్క్వాట్ స్టైల్ టాయిలెట్లను వాడుతారు. వాటిని అప్‌గ్రేడ్ చేసి, ఫ్లోర్‌ను కూడా ఆటోమేటిక్‌గా శుభ్రం చేసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే, నామమాత్రపు రుసుము తీసుకుని మెరుగైన నిర్వహణ అందిస్తారు.ఫిన్‌లాండ్ హెల్సింకిలో టాయిలెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఆన్‌లైన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. జపాన్ రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లోని టాయిలెట్లు ఇళ్లలో ఉన్నంత శుభ్రంగా ఉంటాయి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా, ప్రజలందరూ వాటిని శుభ్రంగా ఉంచడాన్ని తమ కర్తవ్యంగా భావిస్తారు.
అలాగే పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ఫిర్యాదు చేయడానికి జీహెచ్‌ఎంసీ యాప్ లేదా స్వచ్ఛత యాప్స్ వంటివి ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండాలి. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సెల్ఫ్-క్లీనింగ్, ఆటోమేటెడ్ టాయిలెట్లను ఉపయోగించడం. నామమాత్రపు రుసుము తీసుకుని నిరంతరం శుభ్రంగా ఉంచడం. పబ్లిక్ ఆస్తులను తమ సొంతంలా చూసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం చేయాలి.