Robot judges: రోబో జడ్జిలు వస్తున్నారు.. మెషిన్ల తీర్పులో సరైన న్యాయం సాధ్యమేనా?
Robot judges:రోబో జడ్జీలు ఏంటి? అసలు యంత్రాలు సరైన న్యాయం చెప్పగలవా? ఒక మనిషి హృదయం, వివేకం లేకుండా న్యాయం ఎలా సాధ్యం? భవిష్యత్తులో ఈ పరిణామం ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది?

Robot judges
భారత న్యాయ వ్యవస్థ ఒక సైన్స్ ఫిక్షన్ కథలా మారుతోంది. కేసుల భారం, దశాబ్దాల తరబడి సాగే విచారణలు.. వీటన్నిటికీ పరిష్కారంగా ఇప్పుడు కోర్టు గదుల్లోకి రోబోలు(Robot judges) రాబోతున్నాయి. ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ఆధారిత ఈ వ్యవస్థలు, వేగవంతమైన న్యాయం అందిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రోబోలు ఏంటి, జడ్జీలు ఏంటి? అసలు యంత్రాలు సరైన న్యాయం చెప్పగలవా? ఒక మనిషి హృదయం, వివేకం లేకుండా న్యాయం ఎలా సాధ్యం? భవిష్యత్తులో ఈ పరిణామం ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో, న్యాయం ఎలా ఉంటుందోనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-కోర్ట్స్ ఫేజ్-III మిషన్లో భాగంగా, 7,210 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యంగా AI, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. చిన్నపాటి కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, చిన్న నేరాలు, రొటీన్ కేసులలో ఈ AI వ్యవస్థలు వేగంగా తీర్పులు ఇవ్వడానికి సహాయపడతాయి. ఇప్పటికే 70-80 మంది డిస్ట్రిక్ట్/సెషన్స్ కోర్ట్ జడ్జిలకు, ఐసీటీ అధికారులకు సింగపూర్ లాంటి దేశాల్లో ఈ కొత్త టెక్నాలజీపై శిక్షణ ఇప్పించారు.
2024లో సుప్రీంకోర్ట్ జూబ్లీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండే ఒక న్యాయ వ్యవస్థను తయారు చేయాలనే లక్ష్యం గురించి స్పష్టం చేశారు. ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు దీనిలో భాగంగా ఉపయోగపడతాయి. పోలీసు వ్యవస్థ, ఫోరెన్సిక్స్, జైళ్లు , కోర్టులను ఈ టెక్నాలజీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకువస్తుందని అన్నారు. దీని ద్వారా తక్కువ విలువ ఉన్న, ఎక్కువ సంఖ్యలో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం.

AI ఎలా పని చేస్తుందంటే..ఈ AI వ్యవస్థలు కేవలం తీర్పులు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి లీగల్ రీసెర్చ్, కేసుల డాక్యుమెంట్ల విశ్లేషణ, పాత రికార్డుల డిజిటలైజేషన్, మరియు కోర్టులో కేసుల నిర్వహణ వంటి పనుల్లో సహాయపడతాయి. ముఖ్యంగా, గూగుల్ ట్రాన్స్‌లేషన్ టూల్స్ తరహాలో, ఈ వ్యవస్థలు తీర్పులను వివిధ భాషలలోకి అనువదించగలవు. చైనా, ఎస్టోనియా వంటి దేశాలు ఇప్పటికే తమ న్యాయ వ్యవస్థలో AIని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విజయాలు సాధించాయి.
ప్రయోజనాలు, సవాళ్లు..భారతదేశంలో ఇప్పుడు 3.6 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. AI వ్యవస్థల వల్ల వీటి పరిష్కారంలో వేగం పెరగొచ్చు. AI ఒక పక్షపాతం లేకుండా (impartiality) డేటా ఆధారితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవినీతి, లేదా వ్యక్తిగత పక్షపాతానికి తావు ఉండదు. అయితే, ఈ టెక్నాలజీతో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. AIకి నైతికత (ethical) , మానవీయ కోణంలో ఆలోచించే సామర్థ్యం ఉండదు. శిక్షణలో లోపాలు ఉంటే పక్షపాత నిర్ణయాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే, చివరి తీర్పు అధికారం ఎప్పటికీ మానవ జడ్జిల చేతిలోనే ఉంటుంది.
భారత న్యాయ వ్యవస్థలో AI రాక ఒక చారిత్రాత్మక మార్పు. రోబోలు జడ్జిలు(Robot judges)గా మారడం లేదన్నది వాస్తవం. అవి అసిస్టెంట్ జడ్జిలుగా పని చేస్తాయి. చిన్న కేసుల భారాన్ని తగ్గించి, మానవ జడ్జిలకు క్లిష్టమైన కేసులపై దృష్టి పెట్టడానికి అవకాశం కల్పిస్తాయి. సాంకేతికత వేగవంతమైన, పారదర్శకమైన న్యాయాన్ని అందిస్తుంది. కానీ, న్యాయం వెనుక ఉండే ‘మానవ హృదయం’, ‘వివేకం’ ఎప్పటికీ మానవ జడ్జిలదే. ఈ కొత్త మార్పులు భవిష్యత్ న్యాయ వ్యవస్థకు ఒక కొత్త దారిని చూపుతాయని ఆశాభావం కనిపిస్తోంది.
One Comment