Hyderabad:భాగ్యనగర భద్రతలో కొత్త శకం.. 12 జోన్ల పోలీస్ వ్యవస్థతో మారనున్న నగర ముఖచిత్రం

Hyderabad:ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రాజేంద్రనగర్ జోన్లను ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోకి మార్చారు.

Hyderabad

హైదరాబాద్ (Hyderabad)మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ హబ్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర పాలనలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీని 27 మున్సిపాలిటీలతో విలీనం చేసి 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్విభజించడంతో..దానికి సమాంతరంగా తెలంగాణ పోలీస్ శాఖ కూడా తన పరిధిని పూర్తిగా మార్చేస్తోంది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాదు, నేర నియంత్రణలో ఒక విప్లవాత్మక అడుగు. ఈ మార్పుల వల్ల పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మరింత ప్రజలకు చేరువ కాబోతోంది. జోనల్ కమిషనర్లకు అదనపు అధికారాలు కల్పించడం ద్వారా స్థానిక సమస్యలకు వేగంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.

ఈ పునర్విభజనలో అత్యంత కీలక అంశం హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్ పరిధి విస్తరణ. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రాజేంద్రనగర్ జోన్లను ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోకి మార్చారు. దీనివల్ల విమానాశ్రయ భద్రత నేరుగా సిటీ పోలీస్ పర్యవేక్షణలోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ ఆరు జోన్లుగా మారింది.

అందులో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌తో పాటు కొత్తగా చేరిన రాజేంద్రనగర్, శంషాబాద్ ఉన్నాయి. ఈ మార్పు వల్ల నగర ప్రధాన కేంద్రాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పూర్తిగా ఐటీ , పారిశ్రామిక ప్రాంతాలపై దృష్టి సారించేలా మూడు జోన్లు (శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్)గా రూపుదిద్దుకుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు అలాగే ఉండగా, యాదాద్రి జిల్లాను ప్రత్యేక ఎస్పీ పరిధిలోకి మార్చడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సమన్వయాన్ని పెంచారు.

Hyderabad

ఈ మార్పుల వెనుక తెలంగాణ ప్రభుత్వం ఒక బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సిటీ విస్తరణ వల్ల గతంలో ఒకే జోన్ పరిధి చాలా ఎక్కువగా ఉండేది, దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యమవ్వడమే కాకుండా పోలీసులపై పని ఒత్తిడి పెరిగేది. ఇప్పుడు జోన్లను స్థానికీకరించడం వల్ల ప్రతి సర్కిల్‌లో పోలీస్ పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది.

దీనివల్ల నేరాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లలో మహిళల భద్రత, పారిశ్రామిక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ కొత్త వ్యవస్థ ఊతాన్నిస్తుందని భావిస్తోంది. భవిష్యత్తులో షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం ప్రాంతాలను కలిపి ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కల ప్రతి అంగుళం కూడా పోలీస్ నిఘా నీడలోనే ఉండబోతోంది.

సామాన్య ప్రజలకు ఈ మార్పుల వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏమిటంటే, పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించే వేగం పెరుగుతుంది. జీహెచ్ఎంసీ సివిల్ సర్వీసెస్‌తో పోలీస్ వ్యవస్థ సమన్వయం కావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ఆక్రమణలు, స్థానిక గొడవలు వంటి వాటిపై వెంటనే నిర్ణయాలు తీసుకోవడం ఈజీ అవుతుంది.

నగర జనాభా పెరుగుతుండటంతో ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ శాంతిభద్రతలను కాపాడటానికి ఈ 12 జోన్ల వ్యవస్థ ఒక రక్షణ కవచంలా పనిచేయబోతోంది. రాజధాని నగరం విశ్వనగరంగా ఎదుగుతున్న సమయంలో, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఈ పునర్విభజన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version