HSRP : ఇంటి దగ్గరే కూర్చుని HSRP నంబర్ ప్లేట్ పొందండిలా..లేట్ అయితే చిక్కులే..

HSRP : మీ వాహనంపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోతే, భారీ జరిమానాలు, ఇతర చట్టపరమైన సమస్యలు ఎదురవడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

HSRP : మీ వెహికల్ నంబర్ ప్లేట్ ఇంకా పాతదేనా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. అది పాత మోడల్ కారు అయినా, కొత్త బైక్ అయినా సరే, ఇప్పుడు మారిన నియమాల ప్రకారం, మీ వాహనానికి తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) ఉండాల్సిందే. ఈ కొత్త నిబంధనతో ఇప్పటికే పాత నంబర్ ప్లేట్లు ఉన్న వాహనదారులకు కీలక గడువు విధించారు. తెలంగాణలో సెప్టెంబర్ 30, తర్వాత మీ వాహనంపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోతే, భారీ జరిమానాలు, ఇతర చట్టపరమైన సమస్యలు ఎదురవడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

HSRP

హెచ్‌ఎస్‌ఆర్‌పీ( High Security Registration Plate,) అనేది కేవలం ఒక నంబర్ ప్లేట్ కాదు, అది అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థ. దీనిపై ఉండే ప్రత్యేక హలోగ్రామ్, లేజర్ కోడ్, ఏడు అంకెల ప్రత్యేక సంఖ్య వాహనానికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. దీనివల్ల నకిలీ నంబర్ ప్లేట్లు, వాహనాల దొంగతనాలు గణనీయంగా తగ్గుతాయి. నేరస్తులు నంబర్ ప్లేట్లను మార్చి నేరాలకు పాల్పడటం అసాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఈ హెచ్‌ఎస్‌ఆర్‌పీని తప్పనిసరి చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదే.

మీ పాత నంబర్ ప్లేట్‌ను మార్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా www.siam.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించడం. ఆ వెబ్‌సైట్ తెరిచిన తర్వాత, అందులో “హెచ్‌ఎస్‌ఆర్‌పీ రిజిస్ట్రేషన్” ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీ వాహనం వివరాలు అంటే రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ వంటివి సరిగ్గా నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లోనే మనీ పే చేసి.. మీకు దగ్గరలో ఉన్న డీలర్‌ను ఎంచుకుని, నంబర్ ప్లేట్ డెలివరీ లేదా అమర్చే తేదీని బుక్ చేసుకోండి. నంబర్ ప్లేట్ మీ చిరునామాకు అందిన తర్వాత, దాన్ని మీ వాహనానికి బిగించుకుని, ఆ ఫొటోను తిరిగి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

కొత్త వాహనాలకు డీలర్లే నేరుగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగిస్తారు. పాత వాహనాలకు కూడా డీలర్ల వద్ద ఈ సదుపాయం ఉంటుంది. ఇంటి వద్ద అమర్చుకోవాలంటే అదనపు ఛార్జీలు ఉంటాయి. వాహనం రకాన్ని బట్టి రూ. 320 నుంచి రూ. 380 వరకు ద్విచక్ర వాహనాలకు, దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 400 నుంచి రూ. 500 వరకు, కార్లకు రూ. 590 నుంచి రూ. 700 వరకు, దిగుమతి చేసుకున్న కార్లకు రూ. 700 నుంచి రూ. 800 వరకు, త్రిచక్ర వాహనాలకు రూ. 350 నుంచి రూ. 450 వరకు, వాణిజ్య వాహనాలకు రూ. 600 నుంచి రూ. 800 వరకు ఛార్జీలను అధికారులు నిర్ణయించారు.

సెప్టెంబర్ 30 గడువు తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2019 తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ తప్పనిసరి. అంతకు ముందు రిజిస్టర్ అయిన వాహనాలకు కూడా ఇప్పుడు ఇదే నిబంధన వర్తిస్తుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసినా, పాత నంబర్ ప్లేట్ పాడైపోయినా, సాధారణ ప్లేట్లు వాడటం కుదరదు. వాహనం ఎప్పటిదైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉండాల్సిందే.

ఈ నంబర్ ప్లేట్(Number Plate) లేకపోతే ట్రాఫిక్ పోలీసులు లేదా రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకుంటే భారీ జరిమానాలు విధిస్తారు, కొన్నిసార్లు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వంటి కీలక పత్రాలు జారీ చేయబడవు. ఇది వాహనాన్ని రోడ్డుపై నడపడానికి అనర్హంగా మారుస్తుంది. వాహనం రిజిస్ట్రేషన్ మార్పులు జరగవు. మీ వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా హెచ్‌ఎస్‌ఆర్‌పీ తప్పనిసరి అవుతుంది. లేకపోతే ఈ లావాదేవీలు ఆగిపోతాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, వాహన గుర్తింపు సక్రమంగా లేకపోవడం వల్ల సహాయం పొందడం కష్టమవుతుంది.

కాబట్టి, తెలంగాణలో కొత్తగా జారీ అయిన ఆదేశాల ప్రకారం, 2016 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలకు కూడా కచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలు రోడ్డు ఎక్కితే చట్టపరమైన చర్యలు తప్పవు. సాధారణ వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్లను బిగించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీ వాహనానికి బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య సర్టిఫికెట్ వంటి కీలక సేవలు నిలిపివేయబడతాయి. సో బీ అలర్ట్.

 

 

Exit mobile version