Khajana Jewelers
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చందానగర్ ప్రాంతం మంగళవారం (ఆగస్ట్ 12, 2025) పట్టపగలే ఉలిక్కిపడింది. ఉదయం 11 గంటల సమయంలో, మెయిన్ రోడ్డుపై ఉన్న ఖజానా జ్యువెలర్స్(Khazana Jewelers) బంగారం షోరూంలోకి ఆరుగురు దొంగల ముఠా తుపాకులతో చొరబడింది. ఈ దోపిడీ యత్నం నగరాన్ని షాక్‌కు గురిచేసింది.
దొంగలు ముఖాలకు మాస్కులు ధరించి, చేతుల్లో తుపాకులతో షోరూంలోకి వచ్చీరాగానే, బంగారం భద్రపరిచే లాకర్ కీ ఇవ్వాలంటూ సిబ్బందిని బెదిరించారు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో..ఆగ్రహించిన దొంగలు లాకర్ కీ ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి, షోరూం అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు (Gunfire)జరిపారు. ఈ కాల్పుల్లో తూటా గాయంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దొంగలు అక్కడితో ఆగకుండా, షోరూంలోని డిస్‌ప్లే అద్దాలను ధ్వంసం చేశారు.
దోపిడీ జరుగుతోందని సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అప్పటికప్పుడే వాహనాలతో షోరూం(Khajana Jewelers)కు చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని తెలియగానే, దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ కమిషనర్, నిందితులను పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టారు.
ఈ ముఠా రాష్ట్రానికి చెందినదా లేక అంతరాష్ట్ర ముఠాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షోరూంలో దొరికిన వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, పట్టపగలు ఇంత ధైర్యంగా దోపిడీకి యత్నించడం సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.