I Bomma Ravi
తెలుగు సినీ ఇండస్ట్రీకి నిద్రలేకుండా చేసిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి రవి (I Bomma Ravi)విచారణలో ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు బయటపెడుతున్నాడు. పైరసీని ఒక పోటీ లేని వ్యాపారంగా భావించి, ఆరేళ్లలో ఏకంగా 21 వేల సినిమాలను అప్‌లోడ్ చేసిన ఈ ‘పైరసీ వీరుడు’ ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
అయితే, విచారణలో అతను చెబుతున్న మాటలు చూస్తుంటే పోలీసులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తానొక సామాన్య ఉద్యోగిలాగే ఈ పనిని ఎంచుకున్నానని, కేవలం వెబ్ పోర్టల్స్‌కు సేవలు అందించానని చెబుతున్నాడు.
రవి(I Bomma Ravi) ఎంత తెలివైనవాడంటే, పోలీసులకు ఎక్కడా దొరక్కుండా ‘ప్రహ్లాద్ కుమార్’ అనే ఒక కల్పిత వ్యక్తిని సృష్టించాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. చివరికి కరీబియన్ దీవుల పౌరసత్వం కూడా ఆ ప్రహ్లాద్ పేరుతోనే ఉండేలా పక్కా ప్లాన్ వేశాడు. విచారణలో ప్రహ్లాద్ ఎవరని అడిగితే ‘గుర్తులేదు.. ఇప్పుడు చెప్పలేను’ అంటూ దాటవేస్తున్నాడు.
మరోవైపు తన చిన్ననాటి స్నేహితుడు ప్రసాద్ డిజిటల్ సంతకంతో ఆర్థిక లావాదేవీలు నడిపాడు. జైలు నుంచి బయటకు రాలేనన్న భయంతో తరచూ మాట మారుస్తూ, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఐబొమ్మ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటకు రావాలంటే ఈ 12 రోజుల కస్టడీ అత్యంత కీలకం కానుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీని ఏళ్ల తరబడి వేధించిన ఐబొమ్మ వెబ్‌సైట్ సృష్టికర్త ఇమ్మడి రవి(I Bomma Ravi) అరెస్ట్ వెనుక ఒక పెద్ద సినిమా స్టోరీనే ఉంది. రవి గతంలో పోలీసులను సవాల్ చేస్తూ..నేను విదేశాల్లో ఉన్నాను, దమ్ముంటే నన్ను పట్టుకోండని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కానీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టువదలని విక్రమార్కుడిలా ఆరు నెలల పాటు నిఘా పెట్టి, చివరకు నవంబర్ నెలలో కూకట్‌పల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రవిని అరెస్ట్ చేశారు.
రవి స్వస్థలం విశాఖపట్నం. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఇతను 2019 నుంచి ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి పైరసీ సైట్లను నడిపాడు. కేవలం 18 నెలల్లోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి సుమారు 24,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 21,000 కు పైగా సినిమాలను పైరసీ చేసి, యూజర్ల డేటాను కూడా దొంగలించి సైబర్ నేరగాళ్లకు అమ్మాడు. రవి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు పరిశీలిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
