KCR Strategy
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం కల్వకుంట్ల కవిత వ్యవహారం.అయితే బయటికి కనిపిస్తుంది ఒక కుటుంబంలో చీలిక, అంతర్గత విభేదాలుగా ఉండొచ్చు కానీ, ఈ ఎపిసోడ్ వెనుక మాత్రం కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఈ మొత్తం నాటకం కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయాల కోసం రచించిన ఒక పకడ్బందీ స్క్రిప్ట్ అని గట్టిగా చెబుతున్నారు.
కేసీఆర్(KCR Strategy) రాజకీయ ప్రస్థానంపై కాస్త అవగాహన ఉన్నవారికి తెలుసు, ఆయన కేవలం ప్రత్యర్థులను ఓడించడానికి మాత్రమే వ్యూహాలు రచించరు, తన సొంత పార్టీ, కుటుంబ ప్రయోజనాల కోసం కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తారు. గతంలో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించినప్పుడు, ఆనాటి టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతోనే ఈ పార్టీ నడుస్తోందని విమర్శలు వచ్చాయి. కానీ, కొద్ది కాలంలోనే కేసీఆర్ తన అడుగులతో ఆ విమర్శలను తుడిచిపెట్టేసి, సొంత బలం చాటుకున్నారు. ఈ చరిత్ర ఆయన వ్యక్తిగత లక్ష్యం, రాజకీయ ఆధిపత్యం ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇప్పుడు, పార్టీ అధికారంలో లేని సమయంలో, ఆయన ప్రతీ అడుగూ తన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. ఈ కవిత ఎపిసోడ్ ద్వారా, ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వ్యూహం రచించారని తెలుస్తోంది.
ఇటు కవిత కూడా ఒక సాధారణ నాయకురాలు కాదు. ఆమెకు కేసీఆర్(KCR Strategy) లాగే లోతైన రాజకీయ పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి. తండ్రి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న కవిత, ఇప్పుడు ఆయన అడుగులకు మద్దతుగా నడుస్తున్నారని స్పష్టమవుతోంది. బయటికి ఆమె హరీష్ రావుపై విమర్శలు చేస్తూ, పార్టీలో అసమ్మతిని చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నా, అది కేవలం వ్యూహాత్మకంగా వేస్తున్న ఒక అడుగు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ భవిష్యత్తులో బీజేపీతో ఒక ఒప్పందం చేసుకుని, పార్టీని విలీనం చేయాలనుకున్నా, కవిత బీజేపీ వ్యతిరేక రెబల్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సృష్టించుకోవడానికి మార్గం సుగమం అవుతుందన్న లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్లు అంచనాలున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, హరీష్ రావును పార్టీలో ద్వితీయశ్రేణి నాయకుడిగా పరిమితం చేయడం. పార్టీలో కేటీఆర్‌కు ఎదురులేకుండా ఉండేందుకు , హరీష్ ఇమేజ్‌ను ప్రజల్లో, పార్టీ క్యాడర్‌లో తగ్గించడం అవసరం. కవిత ఇప్పుడు హరీష్‌పై చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తాయి.
ఇక రెండవ లక్ష్యం, బీజేపీలో విలీనం. పార్టీని కాపాడుకోలేమని కేసీఆర్ భావించినప్పుడు, బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. ఒకవేళ విలీనం జరిగితే, బీజేపీ తమ షరతులను అమలు చేస్తుంది. అప్పుడు కూడా కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో ఉండాలంటే, ఒక రెబల్ లీడర్ అవసరం. కవిత ఆ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఈ విధంగా కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానానికి ఒక సురక్షితమైన ప్రణాళికను రూపొందించారు.
మొత్తంగా, ఈ పొలిటికల్ ఎపిసోడ్ కేవలం కుటుంబ గొడవ కాదు, అది కేసీఆర్ రాజకీయ చాణక్యానికి, కవిత వ్యూహాత్మక ఆలోచనలకు నిదర్శనం. భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలు, ఈ స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా ఉందో తేటతెల్లం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ..నిజంగానే ఇదంతా కేసీఆర్ రాజకీయ చాణక్యతే(KCR Strategy)నా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.