Hyderabad hotels
నాణ్యత లేని హోటల్స్‌పై దాడి అంటారు.. శుభ్రత కనిపించని డాబా సీజ్ అని ఊదరగొడతారు. కానీ అదంతా రెండు రోజుల హడావుడిగానే మిగిలిపోతుంది తప్ప వాస్తవంలో శుచి, శుభ్రత, నాణ్యతలను ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గాలికొదిలేసిన్నారు. కాసులకే కక్కుర్తి పడుతున్నారో తెరవెనుక రాజీ మంత్రాలు జపిస్తున్నారో తెలీదు కానీ జనాల ఆరోగ్యాలను మాత్రం నడిరోడ్డపైనే వదిలేస్తున్నారు. అవును.. ఇవి గాలి మాటలు కాదు..అధికారిక గణాంకాలు చెప్పే నిజాలు.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం(Hyderabad hotels)లో, ఆహార పదార్థాల నాణ్యత, స్వచ్ఛత ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో హోటల్స్ రెస్టారెంట్స్, భోజనశాలల్లో ఆహార కల్తీ జరుగుతున్నా సరే, దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకబడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై తాజాగా రాజ్యసభలో సమర్పించిన గణాంకాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.
గత నాలుగు నెలల్లో, ఆహార భద్రతా అధికారులు 5,088 తనిఖీలు నిర్వహించి, వాటిలో 381 హోటల్స్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే, వీటిలో 60% కంటే ఎక్కువ కేసులు ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకున్నాయి. 2020 నుంచి 2025 వరకు ఐదేళ్ల కాలంలో, రాష్ట్ర ఆహార భద్రతా విభాగం 18,283 ఆహార నమూనాలను పరీక్షించగా, వాటిలో 2,642 అంటే దాదాపు 15% కల్తీ జరిగినట్లు తేలింది. కానీ కేవలం 964 కేసులకు సుమారు 36% మాత్రమే జరిమానా విధించారు. ఇది ప్రతి ముగ్గురు కల్తీదారులలో ఒకరికి మాత్రమే శిక్ష పడుతుందని ఇది సూచిస్తుంది.
శిక్ష పడని కేసులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం లేదా ఛార్జిషీట్లు తయారు చేయడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. కొన్ని కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని కూడా తెలిపారు. జరిమానాలను నాణ్యత లేని, తప్పుగా బ్రాండ్ చేయబడిన, లేదా అసురక్షితమైన ఆహార పదార్థాల ఆధారంగా నిర్ణయిస్తారు.
నాణ్యత లేని ఆహారాని(Hyderabad hotels)కి రూ. 5 లక్షల వరకు, తప్పుగా బ్రాండ్ చేసిన వస్తువులకు రూ.3 లక్షల వరకు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు సుమారు రూ.45 లక్షల జరిమానాలు వసూలు చేసినా కూడా, ఒక్క ఆహార సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయబడకపోవడం గమనార్హం. అదీ కాక లైసెన్సుల రద్దు చాలా అరుదైన కేసుల్లోనే జరుగుతుందని సాక్షాత్తూ అధికారులే చెబుతున్నారు..
2023-24లో ఎక్కువగా 973 కల్తీ కేసులు నమోదయ్యాయి, అయితే వాటిలో 425 కేసులకు (50% కంటే తక్కువ) మాత్రమే జరిమానా విధించబడింది. అంతకు ముందు సంవత్సరం, 2022-23లో, 894 నమూనాల్లో కేవలం 315 కేసులకు జరిమానా విధించారు.
ఈ పరిస్థితిపై తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పాడి, ఆహార రంగాల(Hyderabad hotels) ప్రతినిధులతో సమావేశమై కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మనం ఆహార నాణ్యతపై రాజీ పడకూడదని ఆయన అన్నారు. అయితే వీటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత సీరియస్‌గా తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్న.
నిజానికి ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇలాంటి చర్యలను అరికట్టడానికి బలమైన చట్టాల అమలు ఎంత అవసరమో ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి.అయినా ఈ ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.