Kaleshwaram
తెలంగాణ రాజకీయాలు మరో కీలక దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వెలువడిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ, మాజీ అధికార బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, ఈ పోరు ఇప్పుడు కోర్టు గడప తొక్కింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే విధించాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఈ నివేదిక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోందని. నివేదికలోని అంశాలను రాజకీయంగా ఉపయోగించుకుని తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు వాదిస్తున్నారు. ఈ నివేదిక, ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిల నుండి వచ్చిన నిర్ణయాలపై కాకుండా, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిందని కూడా వారు వాదనలు వినిపిస్తున్నారు.
కమిషన్ నివేదికలో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణంపై పలు కీలక అంశాలను ఎత్తి చూపింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కమిషన్ నిర్ధారించింది. ఉన్నతాధికారులపై రాజకీయ ఒత్తిడి కారణంగా ఇంజినీరింగ్ ప్రమాణాలు, ప్రాజెక్టు మార్గదర్శకాలను పక్కనబెట్టి పనులు చేసినట్లు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు ప్రారంభ దశలో రూపొందించిన డీపీఆర్‌లకు విరుద్ధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ అభిప్రాయపడింది.
మరోవైపు కమిషన్ నివేదికను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆగస్ట్ 19న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నివేదికను తెలుగులోకి అనువదించి గ్రామీణ ప్రాంతాలకు పంపుతోంది. దీనిపై శాసనసభ సమావేశాల్లో కూడా చర్చించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఈ నివేదికను ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని బీఆర్‌ఎస్‌పై, ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ ఆలోచించింది.అయితే ఇదే సమయంలో రాజకీయ అపర చాణుక్యుడు కోర్టు గుమ్మం ఎక్కడంతో రాజకీయ సమీకరణాలు మొత్తం టర్న్ అవుతున్నాయి.
కాగా ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలను అనేక రకాలుగా ప్రభావితం చేయనుంది.కాళేశ్వరం వివాదంపై కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టుకు వెళ్లడం పార్టీలో పలువురు కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజలు ఇప్పుడు కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు వైఫల్యాలపై నిజాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నివేదిక, కోర్టులో కేసు ప్రజల దృష్టిని ఆకర్షించడంతో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం మరింత కీలకంగా మారనుంది. ఈ వివాదం రానున్న కాలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఘర్షణలను మరింత పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ వివిధ వేదికలపై కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేయడం కొనసాగిస్తుంది.
సమస్య జటిలంగా మారిన ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఈ కేసు హైకోర్టులో ఎలా ముగుస్తుంది, దానిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశను నిర్దేశించనున్నాయి.